బాసరకు మహర్దశ
- రూ.225 కోట్లతో ఆలయ పునర్నిర్మాణం
- చదువులమ్మ ఒడిలో భక్తులకు మెరుగుపడను సౌకర్యాలు
- పనులకు భూమి పూజచేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
- హాజరైన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు
నిర్మల్, ఏప్రిల్ 6 ( విజయక్రాంతి): చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి బాసర ఆలయానికి మహర్దశ రానున్నది. ఆలయ పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 225 కోట్లు కేటాయించగా, పనులను సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కతో కలిసి భూమి పూజ, శంకుస్థాపన చేశారు. మధ్యాహ్నం 12.30 గంటలకు వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య సీఎం భూమి పూజచేశారు.
అనంతరం అభివృద్ధి పనుల శిలాఫలకాలను ఆవిష్కరించారు. బాసర ఆలయ పునర్నిర్మాణ ప్రణాళికను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సంబంధిత అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, సాంస్కృతిక, పర్యటన శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు, రాజ్యసభసభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఆదిలాబాద్ ఎంపీ జీ నాగేశ్, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, మహేశ్వర్‌రెడ్డి, వేడ్మ బొజ్జు పటేల్, దేవాదాయశాఖ ప్రిన్స్‌పల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు,
ఎమ్మెల్సీ దండేవిఠల్, నిర్మల్, బైంసా మున్సిపల్ చైర్మన్ అప్పల కావ్య గణి చక్రవర్తి, దత్తాద్రి, మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావు పటేల్, జీ విఠల్‌రెడ్డి, రేఖ శ్యాంనాయక్, మాజీ మంత్రులు వేణుగోపాలాచారి, ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల, ఆలయ చైర్మన్ శరత్ పాఠక్, సర్పంచ్ వెంకటేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ పునర్నిర్మానంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంబంధిత అధికారులకు దిశానిర్దేశంచేశారు. ఈ సందర్భంగా ముధోల్‌లో రూ.200 కోట్లతో నిర్మించే ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనులను సీఎం ప్రారంభించారు.
సీఎం మనుమడికి అక్షరాభ్యాసం
బాసర ఆలయ పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ఉదయం 11:30 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు బాసరకు చేరుకున్నారు. వీరికి ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు పటేల్, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ముఖ్య నేతలు స్వాగతం పలికారు. బాసర ఆలయానికి చేరుకున్న సీఎం దంపతులకు వేదపండితులు పూర్ణకుంమంతో స్వాగతం పలికారు.
అనంతరం మనుమడు రియాన్సీరెడ్డికి ఆలయ ప్రధాన మండపంలో అక్షరాభ్యాసం చేయించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సతీమణి గీతారెడ్డి, అల్లుడు, కూతురుతో కలిసి పూజలో పాల్గొన్నారు. అనంతరం కుటుంబ సమేతంగా శ్రీ సరస్వతి అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలను సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. సీఎం కుటుంబసభ్యులు బాసర ఆలయ ప్రాంగణంలో ఉన్న కాళికామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వేద పండితులకు వస్త్రాలను బహూకరించారు. బాసరకు వచ్చిన ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులను జిల్లా నేతలు శాలువాలతో సన్మానం చేసి జ్ఞాపికలను బహూకరించారు. సీఎం పర్యటన సందర్భంగా ఎస్పీ జానకి ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. అనంతరం ఓ ప్రైవేట్ హోటల్లో భోజనం చేసి, ఆదిలాబాద్ పర్యటనకు వెళ్లారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు ఆలయానికి వచ్చే భక్తులకు అనుమతి నిరాకరించడంతో మధ్యాహ్నం 2 గంటల వరకు ఇబ్బందికి గురయ్యారు. ఉదయం 8 గంటలకు భక్తుల దర్శనాలను ఆలయ అధికారులు నిలిపివేశారు.




