గడీల పాలన రానిచ్చేదిలేదు
మళ్లీ వచ్చేది మా ప్రభుత్వమే
- ఆదిలాబాద్‌కు పారిశ్రామికవాడ
- జిల్లాలో రూ.1,238 కోట్లతో అభివృద్ధి పనులు జూన్ 2న విమానాశ్రయానికి శంకుస్థాపన చేస్తా
- పిప్రి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి నాటి పాదయాత్రతో ప్రజలకు దగ్గరయ్యా: డిప్యూటీ సీఎం భట్టి
ఆదిలాబాద్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి) : వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంపై తమ ప్రభు త్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని, ఆ దిశగా కోట్లాది రూపాయలను వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభు త్వమే వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. పదేళ్లలో గత పాలకులు చేయని పనులు తాము చేస్తున్నామన్నారు.
కానీ ప్రతిపక్ష నాయకులు ఓర్వలేక ఎంత సేపు బురద జల్లే ప్రయత్నమే చేస్తున్నారన్నా రు. రానున్న రోజుల్లో మళ్లీ గడీల పాలన, రాక్షస పాలన రానివ్వమని సీఎం తెలిపారు. గత ప్రభుత్వంలో అక్రమ అరెస్ట్‌లు, నిర్బం ధాల సంస్కృతి కొనసాగిందన్నారు. ఎన్నో పోరాటాలు చేస్తేనే ప్రజా ప్రభుత్వం వచ్చిందని, అందుకే ప్రజా పాలన సంబరాలు చేసుకుంటున్నామన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఆతర్వాత అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు.
ప్రతిపక్షాలకు తాము రాజకీయ ప్రత్యర్థులమే మాత్రమని, శత్రువులం కాదన్నారు. తెలంగాణ అంటేనే దేశానికి ఆదర్శంగా నిలవాలన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా పిప్రి గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదిలాబాద్‌కు పారిశ్రామిక వాడను ఏర్పాటు చేస్తామని, యూనివర్సిటీ ఏర్పాటుకోసం త్వరలో ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు.
బాసర ఆలయ అభివృద్ధి కోసం రూ.225 కోట్లు మంజూరు చేశామన్నారు. దేశంలోనే బాసర ఆలయాన్ని గొప్ప ఆలయంగా తీర్చి దిద్దు తామన్నారు. గూడెం సత్యనారాయణ స్వామి ఆలయానికి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్ అభ్యర్థన మేరకు నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. నిర్మల్‌లో యంగ్ ఇండియా స్కూల్ మంజూరు చేస్తామ న్నారు. రెండు నెలలకు ఒకసారి ఆదిలాబాద్ జిల్లాకు వస్తానని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు.
నిర్మల్ జిల్లా బాసర నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో పిప్రి గ్రామానికి చేరుకున్న సీఎం ముందుగా జిల్లాలో రూ.1,238 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, శిలా ఫలకాలను ఆవిష్కరించారు. గతంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర పిప్రిలో మొదలై ఖమ్మంలో విజయవంతంగా ముగిసిందని రేవంత్‌రెడ్డి చెప్పారు.
గతంలో తాను గూడాలలో తిరిగినప్పుడు గమనించిన సమస్యలను, ఇచ్చిన హామీలను ప్రస్తుతం ఒక్కొక్కటిగా నెరవేరిస్తున్నామన్నా రు. ఈ ప్రాంతంలో అందరికీ విద్య, వైద్యం అందాలని, 2030లోపు ఆదిలాబాద్ జిల్లాను అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాగా చూపిస్తాం అని హామీ ఇచ్చారు. అడవుల జిల్లా అయిన ఆదిలాబాద్‌లో అపారమైన ఖనిజ, వనరులు, సంస్కృతీ సంపదలున్నాయన్నారు.
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తామని, సాగు నీటి సమస్యను ప్రస్కరిస్తామన్నారు. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ల సహకారంతో విమానాశ్ర యం కోసం కృషిచేశామని, జూన్ 2న విమానాశ్రయం పనులకు శిలాఫలకం వేసి పనులు ప్రారంభిస్తామని స్పష్టంచేశారు.
నాటి పాదయాత్రతో ప్రజలకు దగ్గరయ్యా: డిప్యూటీ సీఎం భట్టి
సభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పిప్రి గ్రామంలో బహిరంగ సభ నిర్వహణ సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన అని, తన ఆలోచన కాదన్నారు. పిప్పిరి నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేపట్టి ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ఉంటారు, ప్రజలు చెప్పిన అనేక సమస్యలు విని ఉంటారు, వాటిని వెంటనే మంజూరు చేసి అమలుచేయాల్సిన బాధ్యత మనపై ఉందని సీఎం స్వయంగా చెప్పారని తెలిపారు.
మండుటెండల్లో ఆనాడు తనతో నడిచి పాదయాత్రను విజయవంతం చేశారని గుర్తు చేశారు. ఈ సభ ద్వారా జిల్లాలో రూ.1,238 కోట్ల విలువైన పనులు అన్నిటికీ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారని, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఒక రాజకీయ సభ కాదు.. ఆనాడు తను ప్రజలతో ఏర్పరచుకున్న అనుబంధం ఈ సభ అని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.
అధికారం లోకి రావడానికి రాజకీయ పార్టీలు అనేక హామీలు ఇస్తాయి కానీ అధికారంలోకి రాగానే మర్చిపోతాయి, కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం లోని యావత్ క్యాబినెట్ మేం పాలకులం కాదని, ప్రజా సేవకులు అని ప్రజా సంక్షేమం కోసం పని చేస్తున్నామని తెలిపారు. అధికారం అంటే హోదా అని, అధికారం అంటే పెత్తనం చేయడమే అనే ఆలోచన సీఎం రేవంత్‌రెడ్డికి గాని, డిప్యూటీ సీఎంగా నాకు కానీ మా క్యాబినెట్ సభ్యులకు గానీ లేదన్నారు.
అందుకే అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల కాలంలోనే 99% హామీలు అమలు చేసిన గొప్ప ప్రభుత్వం మాది అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతంలో నడుస్తున్నప్పుడు ఇల్లు లేదని 10 సంవత్సరాలుగా ఇల్లు కోసం గోడు వెళ్ళబోసుకుంటున్నామని అనేకమంది ఎన్నికల ముందు ఆవేదన వ్యక్తంచేశారు ఓవైపు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి, మరోవైపు సీఎల్పీ నేతగా తాను పాదయాత్ర చేశామని గుర్తుచేశారు.
‘ఆనాడు మాతో గోడు వెళ్ళబోసుకున్న ఆడబిడ్డల మాటలను దృష్టిలో పెట్టుకొని అధికారంలోకి రాగానే 22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించాం ఒక్కో ఇంటిని 5 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నాం. నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇళ్లను మంజూ రుచేసి నిర్మాణాలు ప్రారంభించి చిత్తశుద్ధిని చాటుకున్న ప్రభుత్వం తమది’ అని డిప్యూటీ సీఎం అన్నారు.
రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా 9 రోజుల్లోనే 9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశామని, నిన్న ప్రతి రైతు ఖాతాలో రైతు భరోసా నిధులు విడుదల చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి, ఆది శ్రీనివాస్, విజయరమణ రావు, ఎంపీ గోడం నగేష్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే లు అనిల్ జాదవ్, పాయల్ శంకర్, ప్రేమ్‌సాగర్ రావు,
వెడమ బొజ్జు పటేల్, ఎమ్మెల్సీ దండే విట్టల్, కేంద్ర మాజీమంత్రి వేణుగోపాలచారి, డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహజాన్, అటవీశాఖ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్, ఐటీడీ ఏపీఓ యువరాజు మర్మట్‌తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.




