15 June, 2026 | 8:12 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి

15-06-2026 06:59 PM

– ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు..

ఉట్నూర్,(విజయక్రాంతి): గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటిడిఏ) ప్రాజెక్టు అధికారి సూచించారు. సోమవారం ప్రాజెక్టు అధికారి మందమకరందు గిరిజన ప్రాథమిక పాఠశాల శాటిలైట్ సెంటర్ అర్జుని (కె),  నార్నూరు మండలంలోని మల్కాపూర్ లోని గిరిజన ఆశ్రమ పాఠశాల బాలికల,  గాదిగూడ  మండలంలోని  జరీ  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.

ఈ సందర్భంగా పాఠశాలల్లో తరగతి గదులను సందర్శించి విద్యా బోధన తీరును పరిశీలించారు. కొత్త విద్యా సంవత్సరంలో చేరిన విద్యార్థులకు అనుకూలమైన విద్యా వాతావరణం కల్పించాలని, విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంపొందించేలా బోధన కార్యక్రమాలు నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతి విద్యార్థి అభ్యాస పురోగతిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. పాఠశాల భవనాలు, తరగతి గదులు, వసతి గృహాలు, మరుగుదొడ్లను పరిశీలించిన ప్రాజెక్టు అధికారి, ఎలాంటి మరమ్మతుల అవసరం తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు.

విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పాఠశాల ఆవరణ, వంటశాల, భోజనశాల పరిసరాల్లో పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని సూచించారు. మధ్యాహ్న భోజనాన్ని ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యతతో అందించాలని, విద్యార్థులకు అవసరమైన సి-విటమిన్, ఐరన్ మాత్రలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.

కొత్త విద్యా సంవత్సరంలో తొలి రోజు పాఠశాలకు హాజరైన విద్యార్థులతో ఆయన ఆప్యాయంగా ముచ్చటించి వారి విద్య, ఆరోగ్యం, వసతి సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. విద్యార్థుల సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించే చర్యలు చేపట్టాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. అనంతరం జరీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ప్రాజెక్టు అధికారి, రోగుల రిజిస్టర్లు, వైద్య సేవల నిర్వహణ, ఔషధ నిల్వలను పరిశీలించారు.

అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు వంటి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని, ప్రజల్లో ఆరోగ్య అవగాహన కల్పించాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో విద్యా, ఆరోగ్య రంగాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అధికారులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని ప్రాజెక్టు అధికారి ఈ సందర్భంగా తెలిపారు.