డీలిమిటేషన్, మహిళా బిల్లుపై పెదవి విప్పండి
- మేథావుల్లారా.. మీ మౌనం సమాజానికి అరిష్టం
- మహిళలు చట్టసభల్లో అడుగుపెట్టకూడదా?
- కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టండి
- కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
కరీంనగర్, ఏప్రిల్20(విజయక్రాంతి): డిలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలైతే సమాజానికి జరిగే ప్రయోజనాలపై మేథావులు పెదవి విప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. మేధావుల మౌనం సమాజానికి అరిష్టమని ఆందోళన వ్యక్తం చేశారు.‘మేథావులకు రాజకీయాలతో పనిలేదు. వ్యక్తులతో పనిలేదు. సమాజంలో తప్పు జరిగితే ఇది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉంది.
మంచి పనులు చేస్తే సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత కూడా మీపై ఉంది. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లుపై మేథావి వర్గం మౌనం వహించడం, పక్షపాత ధోరణి అవలంభించడం సరికాదు’. అని అన్నారు. సమాజంలో జరిగే మంచి చెడులపై, పాలకుల నిర్ణయాలపై అంబేద్కర్ నిష్కర్షగా అభిప్రాయాలను చెప్పేవారని గుర్తు చేశారు.జ్ఞానంలో అంబేద్కర్ వారసులైన మీరు అందుకు భిన్నంగా మౌనం వహించడం సమాజానికి ఏమాత్రం మంచిది కాదని హితవు పలికారు.
‘ఇకనైనా మౌనం వీడండి. తప్పును తప్పుగా చెప్పండి. ఆ బిల్లులతో మహిళలకు, సమాజానికి మంచి జరుగుతుందని భావిస్తే మీడియా, సోషల్ మీడియా, సదస్సులు, సమావేశాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లండి.అంబేద్కర్ కోరుకున్నట్లుగా అట్టడుగునున్న వర్గాలందరికీ ఆర్దిక, సామాజిక సమానత్వం, రాజకీయ స్వేచ్ఛ హక్కులు దక్కేందుకు మీ వంతు సహకారం అందించండి.వాటి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న మోదీ సర్కార్‌కు అండగా నిలవాలని చేతులెత్తి విజ్ఝప్తి చేస్తున్నా’.అని పిలుపునిచ్చారు.
రాజ్యాంగ రూపకర్త, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్ లోని శుభమంగళ కన్వెన్షన్ లో సోమవారం నిర్వహించిన ‘మేథావుల సదస్సు’లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సదస్సులో కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, దళిత మోర్చా అధ్యక్షులు సోమిడి వేణు, కార్పొరేటర్లు గుగ్గిళ్ల రమేశ్, బోయినిపల్లి ప్రవీణ్ రావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.






