1 August, 2026 | 2:57 AM

జిల్లా జైలును సందర్శించిన ఎస్పీ

01-08-2026 01:09 AM

జైలు భద్రత, ఖైదీల సంక్షేమం, పెరోల్ అంశాలపై అధికారులతో సమీక్ష

ఆదిలాబాద్, జూలై 31 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జైలును సెక్యూరిటీ, తదితర అంశాల దృష్ట్యా శుక్రవారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సందర్శించారు. ఖైదీల బ్యారక్లు (గదులు), జైలు ఆసుపత్రి, వంటశాల, పరిపాలనా విభాగాలు, ఇతర గదులను తనిఖీ చేశారు.

జైలు ప్రహరీ గోడ, భద్రతా గోడలు, ప్రధాన ప్రవేశ ద్వారం, వాచ్ టవర్లు, భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించి, భద్రతా ప్రమాణాలు ఎల్లప్పుడూ పటిష్టంగా ఉండేలా అధికారులు నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఖైదీలకు ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలు నాణ్యతతో అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం జిల్లా ఎస్పీ జైలు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి జైలు భద్రతా ఏర్పాట్లు, ఖైదీల నిర్వహణ, సంక్షేమ చర్యలు, జైలు పరిపాలన తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు.

జైలులో ఉన్న ఖైదీల వివరాలు, వారికి అందిస్తున్న భోజనం, వైద్య సేవలు, రోజువారీ విధులు, పునరావాస కార్యక్రమాలు, ఇతర సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెరోల్ మంజూరు ప్రక్రియ, అర్హులైన ఖైదీల దరఖాస్తుల పరిశీలన, నిబంధనల అమలు, పెర్పో విడుదలయ్యే ఖైదీల పర్యవేక్షణ అంశాలపై అధికారులతో చర్చించి, నిబంధనలకు అనుగుణంగా అర్హులైన ఖైదీల దరఖాస్తులను సకాలంలో పరిశీలించాలని సూచించారు. అంతకుముందు జైలు సిబ్బందితో ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ఎల్. జీవన్ రెడ్డి, వెంకట నరసయ్య, జైలు ఇన్చార్జ్ సూపరింటెండెంట్ పీ గోపిరెడ్డి, జైలర్ ఎన్ చంద్రశేఖర్, సీఐ కే నాగరాజు, ఆర్‌ఐ డీ వెంకటి, జైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.