త్రివేణి పాఠశాల విద్యార్థులను అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
జిల్లా టాపర్లుగా నిలిచిన త్రివేణి విద్యార్థులు
కొత్తగూడెం,(విజయక్రాంతి): ఇటీవల విడుదలైన తెలంగాణ పదో తరగతి (ఎస్ ఎస్ సి) ఫలితాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, అద్భుత ప్రతిభ కనబరిచిన త్రివేణి పాఠశాల విద్యార్థులను జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రోహిత్ రాజు ఐపీఎస్, ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాలకు చెందిన విద్యార్థిని బి. అక్షయ శివాని 592 మార్కులు సాధించి జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, పి. అక్షయ్ , కె. వర్షిత 586 మార్కులతో జిల్లా ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులను, వారి తల్లిదండ్రులను , పాఠశాల యాజమాన్యాన్ని ఎస్పీ సాదరంగా ఆహ్వానించి అభినదించారు.
ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ ,కఠోర శ్రమ, క్రమశిక్షణతో చదివి జిల్లా స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించి కొత్తగూడెం కీర్తిని చాటిన విద్యార్థులు అందరికీ ఆదర్శమని కొనియాడారు. విద్యార్థులు ఇదే పట్టుదలతో భవిష్యత్తులో, ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన త్రివేణి విద్యాసంస్థల విద్యా ప్రమాణాలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.






