28 August, 2026 | 12:20 AM

బాలాజీ పవన్ స్వీట్ షాప్‌పై ఎస్ఓటి పోలీసుల దాడులు

27-08-2026 10:37 PM

కుళ్ళిన, కాలం చెల్లిన ఆహార పదార్థాల స్వాధీనం

ఘట్ కేసర్,(విజయక్రాంతి)​: పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌదరిగుడా వెంకటాద్రి టౌన్‌షిప్‌లో ఉన్న బాలాజీ పవన్ స్వీట్స్ అండ్ స్నాక్స్ షాప్‌పై ఉప్పల్ జోన్ ఎస్‌ఓటీ పోలీసులు బుధవారం స్థానిక పోలీసులతో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ​ఈ తనిఖీల్లో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో కాలం చెల్లిన స్వీట్లు, తినుబండారాలు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

​​నిల్వ ఉంచిన పదార్థాలు, గడువు ముగిసిన రసాయనాలు, నాణ్యత లేని నూనెలను ఉపయోగించి స్వీట్లు, హాట్లు తయారు చేస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు. కిచెన్ పరిసరాలు ఈగలు, దుమ్ము ధూళితో అత్యంత వికారంగా ఉన్నాయని, కనీస పరిశుభ్రతా ప్రమాణాలు పాటించడం లేదని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తయారు చేసిన భారీ పరిమాణంలో ఉన్న తినుబండారాలు, రసాయనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ షాప్ నిర్వాహకుడు రాజస్థాన్‌కు చెందిన కమల్ కుడ్కుడియా (37) అని పోలీసులు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న పదార్థాలతో పాటు నిందితుడిని పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు అప్పగించారు. షాప్ నిర్వాహకుడిపై ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ (ఆహార కల్తీ నిరోధక చట్టం) కింద పోచారం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ​​షాప్ యజమానులపై కేసు నమోదు చేసిన పోలీసులు, సేకరించిన శాంపిల్స్‌ను ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌కు పరీక్షల నిమిత్తం పంపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లు, స్వీట్ షాప్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉప్పల్ జోన్ ఎస్ఓటి పోలీసులు హెచ్చరించారు.