ఎస్‌ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి
- జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు
హాజీపూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టి త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండలం కర్ణమామిడి, లక్షెట్టిపేట మండలం చందారం గ్రామపంచాయతీ కార్యాలయాలలో ఎస్‌ఐఆర్‌పై నిర్వహించిన గ్రామసభలలో ఆయా మండలాల తహసిల్దార్లు, అధికారులతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచి, అందులో గుర్తించిన అనామలీస్ ఓటర్ల వివరాలను గ్రామసభలో చదివి వినిపించాలని బూత్ స్థాయి అధికారులను ఆదేశించారు. ఎ.ఎస్.డి. (Absent, Shifted, Dead) ఓటర్లకు సంబంధించి నోటీసులను నిబంధనల ప్రకారం జారీ చేసి, తదుపరి ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రతి దశను పారదర్శకంగా, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని బూత్ స్థాయి అధికారులు, సంబంధిత అధికారులను ఆదేశించారు.






