జిల్లాలో సంక్షేమ, అభివృద్ధి ఫలాలు వేగవంతం చేయాలి
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో డిజిటల్ విద్య, వైద్య సేవలు, అంగన్‌వాడీల బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఆయన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశాలు నిర్వహించారు. తొలుత స్వాశోధన్ ట్రస్ట్ ప్రతినిధులతో సమావేశమైన కలెక్టర్.. డిజిటల్ హెల్త్ సర్వీసెస్, విద్యా రంగానికి అందుతున్న సాంకేతిక తోడ్పాటు, డిజిటల్ అంగన్‌వాడీ సేవల విస్తరణతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రోత్సాహం కోసం చేపడుతున్న వివిధ కార్యక్రమాల ప్రస్తుత స్థితిని ఆరా తీశారు.
ఈ రంగాల్లో సాధించిన పురోగతిని సమీక్షిస్తూ, క్షేత్రస్థాయిలో ఇంకా ఏమేమి వసతులు అవసరమనే అంశాలపై చర్చించారు. అనంతరం నార్నూర్ ఆస్పిరేషనల్ బ్లాక్ అభివృద్ధిపై ప్రత్యేక సమీక్ష చేపట్టారు. బ్లాక్ పరిధిలో నిర్దేశిత కీలక పనితీరు సూచికల సాధనలో పురోగతిని సమీక్షించారు. పాత ప్రాజెక్టుల అమలులో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుంటూ, నూతనంగా మంజూరైన పనులను త్వరితగతిన ప్రారంభించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు సకాలంలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో డిఆర్డీఓ రవీందర్, డిఈఓ మాధవి, డిహెమ్హెచ్ఓ డా.సాధన, ఎఫ్డీఓ ప్రథమేష్, నీతి ఆయోగ్ ప్రోగ్రామ్ అధికారి రాహుల్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.






