ఆకట్టుకున్న ‘సంఘం శరణం గచ్చామి’
టేకులపల్లి,(విజయక్రాంతి): డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీవిత చరిత్ర, ఆశయాలు, రాజ్యాంగ విలువలు, సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటాన్ని ప్రతిబింబిస్తూ ప్రదర్శించిన ‘సంఘం శరణం గచ్చామి’ నాటిక ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. టేకులపల్లి సింగరేణి కాలనీ సీఈఆర్ క్లబ్‌లో సింగరేణి కాలరీస్ కంపెనీ సహకారంతో హైదరాబాద్‌కు చెందిన అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో గురువారం నాటికను ప్రదర్శించారు. కార్యక్రమానికి ఇల్లందు ఏరియా జనరల్ మేనేజర్ వీసం కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి నాటికను ప్రారంభించారు.
అంబేద్కర్ బాల్యం నుంచి విద్యాభ్యాసం, ఆయన ఎదుర్కొన్న సామాజిక వివక్ష, విద్య ద్వారా సాధించిన ఉన్నత స్థానం, అణగారిన వర్గాల హక్కుల కోసం చేసిన పోరాటం, భారత రాజ్యాంగ రూపకల్పనలో ఆయన పోషించిన కీలక పాత్ర వంటి అంశాలను కళాకారులు భావోద్వేగభరితంగా ఆవిష్కరించారు. సమానత్వం, సామాజిక న్యాయం, మానవ హక్కుల కోసం అంబేద్కర్ చేసిన కృషిని కళ్లకు కట్టినట్లు చూపించారు.
నాటికను వీక్షించిన జీఎం వీసం కృష్ణయ్య కళాకారుల ప్రతిభను అభినందించారు. అంబేద్కర్ జీవితం, ఆశయాలు, సమాజానికి అందించిన సేవలు, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటాన్ని కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారని ప్రశంసించారు. ఇటువంటి కళా, సాంస్కృతిక కార్యక్రమాలు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, విద్యార్థులు, ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. నేడు ‘సత్యశోధన’
నాలుగు రోజుల సామాజిక చైతన్య నాటకోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఇదే వేదికపై మహాత్మా జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే జీవితాలు, ఆశయాలు, సామాజిక సంస్కరణలను ప్రతిబింబించే ‘సత్యశోధన’ నాటికను ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో కేఓసీపీ ఓ మాధవరావు, కేవైసీ మేనేజర్ శ్రీనివాసరావు, అడిషనల్ మేనేజర్ ఉండం బ్రహ్మం, ఇతర అధికారులు, ఉద్యోగులు, ఉద్యోగ కుటుంబ సభ్యులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.






