22 May, 2026 | 4:42 PM

మార్కెట్లో నిండుకున్న జొన్న మొక్కజొన్న పంట

22-05-2026 03:40 PM

రవాణా లేక రైతులకుతప్పని ఇబ్బంది

బోథ్,(విజయక్రాంతి): ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న జొన్న మొక్కజొన్న పంటల దిగుబడి అధికంగా ఉండడంతో కొనుగోలు కేంద్రాలలో తూకం వేసిన పంట అలాగే ఉండిపోయింది. పంట రవాణాకు లారీల కోరత ఏర్పడడంతో రైతులు తూకం వేసిన పంట బస్తాల పైనే రాత్రి పగలు కాపలా కాయాల్సి వస్తున్నది. సోనాల మండల కేంద్రంలో రెండుచోట్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. గన్ని బ్యాగులు వచ్చిన తర్వాత తూకం వేయడం జరిగింది.

అయితే పంట తూకం వేసేందుకు అవసరమైన కాంటాలు లేకపోవడంతో శుక్రవారం రైతులు కాంటాల కోసం ఎదురు చూశారు. సహకార సంఘం వారు మార్కెటింగ్ అధికారులు అదనపు కాంటాల కొనుగోలు చేసి ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. మరోవైపు స్థలం లేకపోవడంతో పంటను రైతులు తీసుకువచ్చిన కుప్పలుగా పోసేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. తూకం వేసిన బస్తాలను తరలించే ఏర్పాటు చేయాలని అధికారులను రైతులు కోరుతున్నారు.