బాలల హక్కుల పరిరక్షణకు సమిష్టి కృషి అవసరం
జిల్లా సంక్షేమ అధికారి స్వరూప రాణి
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): బాలల హక్కులకు సంపూర్ణ రక్షణ కల్పించేందుకు అధికారులు, సిబ్బంది సమిష్టిగా కృషి చేయాలని జిల్లా సంక్షేమ అధికారి స్వరూప రాణి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాల రక్షా భవన్‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ అమలవుతున్న బాలల సంరక్షణ చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా బాలల పరిరక్షణ అధికారి బి.మహేష్‌ను కలిసి పోక్సో కేసుల పురోగతి, బాల్య వివాహాల నివారణకు తీసుకుంటున్న చర్యలు, బాలల సంక్షేమ కార్యక్రమాల అమలుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో బాలల భద్రత, విద్య, ఆరోగ్యం, సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆమె సూచించారు.
బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, బాలలపై వేధింపుల నిర్మూలనకు శాఖ సిబ్బంది సమన్వయంతో అంకితభావంతో పనిచేయాలని ఆదేశించారు.ప్రతి బాలుడు సురక్షితమైన, అనుకూలమైన వాతావరణంలో ఎదిగే హక్కు కలిగి ఉన్నాడని పేర్కొన్న ఆమె, బాలల హక్కుల పరిరక్షణలో అధికారులు మాత్రమే కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. బాలల సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు గ్రామస్థాయిలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అలాగే, సమస్యాత్మక పరిస్థితుల్లో ఉన్న బాలలకు తక్షణ సహాయం అందించేలా చైల్డ్ హెల్ప్‌లైన్ సేవలను మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాల రక్షా భవన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






