వడదెబ్బపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
సూర్యాపేట డిప్యూటీ డీఎంహెచ్‌ఓ గాజుల చంద్రశేఖర్
తుంగతుర్తి,(విజయ క్రాంతి): తుంగతుర్తి మండలం కేంద్రానికి చెందిన చర్లపల్లి సోమయ్య వడదెబ్బతో మృతి చెందిన నేపథ్యంలో, జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌ఓ గాజుల చంద్రశేఖర్ మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, వేసవి కాలంలో ప్రజలు వడదెబ్బల నివారణపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున అత్యవసర పరిస్థితులు మినహా మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకుండా ఉండాలని సూచించారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండేందుకు తరచూ నీరు, మజ్జిగ, ఓఆర్‌ఎస్ ద్రావణాలు వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని తెలిపారు.
ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. తలనొప్పి, అధిక చెమటలు, నీరసం, తల తిరగడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం వంటి వడదెబ్బ లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి వైద్య సేవలు పొందాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.






