పంట కొనుగోళ్లపై శ్వేతపత్రం విడుదల చేయాలి
రాష్ట్రంలో 35 శాతానికి మించి ధాన్యం కొనుగోళ్ల జరగలేదు
కోటిన్నర టన్నుల పంట వస్తే.. సగం కూడా కొనలేదు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో(Telangana State) కోటిన్నర టన్నుల పంట వస్తే సగం కూడా కొనలేదని కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతల పరిస్థితి, పంట కొనుగోళ్ళ సంక్షోభంపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. పంటల కొనుగోళ్లపై రేవంత్ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతులను ఇలాగే నిర్లక్ష్యం చేస్తే బీఆర్ఎస్ పోరాటాలకు దిగుతోందన్నారు. రైతు సమస్యలే ఏకైన అజెండాగా రేపు మంత్రి వర్గ సమావేశం జరగాలని హెచ్చరించారు.
ధాన్యం కొనటం లేదని రైతులు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారని కేటీఆర్ వాపోయారు. రైతులే కాదు.. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ధర్నా చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. నిన్న సీఎం సొంత నియోజకవర్గంలో కూడా రైతులు ధర్నాలు చేశారని ఎద్దేవా చేశారు. మంచిర్యాల జిల్లాలో నలుగురు రైతులు చనిపోయారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనటం లేదని ఒకరిద్దరు రైతులు పురుగుల మందు తాగారని చెప్పారు. కొన్ని చోట్ల ఎండల తీవ్రత వల్ల ధాన్యం కుప్పల మీద రైతులు చనిపోయారని వెల్లడించారు. తెలంగాణలో 35 శాతానికి మించి ధాన్యం కొనుగోళ్లు జరగలేదని కేటీఆర్ స్పష్టం చేశారు.






