27 April, 2026 | 9:53 PM

రసాయన ఎరువులతో తగ్గుతున్న భూసారం

27-04-2026 08:11 PM

- వ్యవసాయ శాస్త్రవేత్తలు

- పొనుగోడు లో రైతు ముంగిట శాస్త్రవేత్తల కార్యక్రమం ప్రారంభం

గరిడేపల్లి,(విజయక్రాంతి): పంట పొలాల్లో రైతాంగం మోతాదుకు మించి రసాయనక ఎరువులను,యూరియాను వాడటంతో భూసారం గణనీయంగా తగ్గిపోతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ సుకుమార్, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామం లో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో శాస్త్రవేత్తల బృందం పర్యటించింది. తెలంగాణ వ్యవసాయ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సులో వారు పాల్గొని మాట్లాడారు.

రైతాంగం మోతాదుకు మించి విరివిగా రసాయన మందులు పిచికారి చేయడంతో భూమి ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిపారు.రైతులు రసాయన మందుల వాడకం తగ్గించి సేంద్రియ వ్యవసాయం చేపట్టే దిశగా ఆలోచన చేయాలని కోరారు.ఈ సందర్భంగా రసాయన మందులు పిచికారిలో ప్రణాళిపాయం కలగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై, నూతన ఉరి వంగడాల విశిష్టతపై, సేంద్రియ సాగు ప్రాధాన్యతపై రైతులకు శాస్త్రవేత్తలు వివరించారు. ఏప్రిల్ 27 నుంచి మే 23 వరకు శాస్త్రవేత్తలు నేరుగా గ్రామాలకు వచ్చి రైతులకు వ్యవసాయం సాగు చేసే విషయంలో మెలకువలను నేర్పుతారని, సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తారని వారు తెలిపారు.

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వారు వివరించారు. అనంతరం మండల వ్యవసాయ అధికారి ప్రీతం కుమార్ మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంట మార్పిడి విధానాన్ని చేపట్టాలని సూచించారు. సాగునీటిని పొదుపుగా వాడుకుంటూ ముందస్తు ప్రణాళికతో రైతులు సాగు చేపట్టాలని కోరారు.