ఢిల్లీకి రేవంత్ హమాలీ
- కాంగ్రెస్ పెద్దలకు సీఎం డబ్బు సంచుల మోత
- రాష్ట్ర ప్రయోజనాలు విస్మరణ
- హమాలీలు మాత్రం వడ్లబస్తాలు మోస్తూ ప్రజాసేవ
- బీఆర్‌ఎస్‌ను బద్నాం చేయడానికే.. కాళేశ్వరం పంపులు బంద్
- సన్నాల బోనస్ ఎగ్గొట్టే కుట్ర
- రెండేళ్లలో మళ్లీ కేసీఆరే సీఎం
- హమాలీల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం
- 18వ హమాలీ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ మహాసభలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్/ఉప్పల్, జూలై 6 (విజయ క్రాంతి): హమాలీ కార్మికులు కష్టపడి వడ్ల బస్తాలు మోస్తూ ప్రజాసేవ చేస్తోంటే.. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ పెద్దల కోసం డబ్బు సంచులు మోస్తూ పెద్ద హమా లీగా మారారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శిం చారు. అందుకే రాష్ట్ర ప్రయోజ నాలను విస్మరిస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ను బద్నాం చేయడానికే కాళేశ్వరం పంపులను ముఖ్యమంత్రి ఆన్ చేయడం లేదని, నీళ్లిస్తే మద్దతు ధర, బోనస్ ఇవ్వాలనే దురుద్దేశంతోనే పంటలను ఎండబె డుతున్నారని ఆరోపించారు.
హమాలీల సమస్యలన్నింటినీ పరిష్కరించే ‘బాధ్యత నాదే’నని, రెండేళ్లలో మళ్లీ కేసీఆర్‌ను సీఎంను చేసుకుందామని హమామీల కు పిలుపునిచ్చారు. మల్లాపూర్‌లో సో మవారం నిర్వహించిన 18వ హమాలీ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హమాలీలు వడ్ల బస్తాలు మోసి ప్రజలకు అన్నం అందించే గొప్ప సేవ చేస్తున్నారని, కానీ ముఖ్యమంత్రి మాత్రం ఢిల్లీలోని తన పార్టీ పెద్దలను సంతోషపెట్టేం దుకు డబ్బుల సంచులు మోస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ పాలనలో హమాలీలు, రైతులు, మిల్లు యజమానులు అందరూ సంతోషంగా ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని అన్నారు.
బీఆర్‌ఎస్‌ను బద్నాం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని, అందుకే కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్‌హౌస్‌లు (రెండు పంపులు) ప్రారంభించ కుండా లక్ష క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారని ఆరోపించారు. రైతులకు నీరు అందిస్తే ఎరువులు ఇవ్వాలి, పంటలు పండితే మద్దతు ధర, బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే దురుద్దేశంతోనే ప్రభుత్వం నీటిని విడుదల చేయడం లేదని విమర్శించారు. నీరు అందు బాటులో ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా పంటలను ఎండబెట్టి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు.
కన్నెపల్లి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని, తమపై ఎంత కోపం ఉన్నా కేసులు పెట్టుకోవచ్చని, కానీ రైతులపై కక్ష సాధింపు చర్యలు తీసుకోవద్దని కోరినట్లు కేటీఆర్ తెలిపారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమని, కానీ రైతులను వేధిస్తే ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాష్ట్రాన్ని మంచి నాయకుడు పాలిస్తే పేదలు, రైతులు, హమాలీలు, మిల్లు యజమానులు అందరూ సంతోషంగా ఉంటారని, కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ అదే చూసిందన్నారు. గోదావరిలో నీరు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడం వల్ల సాగు విస్తీర్ణం భారీగా పెరిగి, తెలంగాణ సస్యశ్యామలంగా మారిందన్నారు. రైతులు అభివృద్ధి చెందితే హమాలీలకు కూడా ఉపాధి పెరిగిందని గుర్తు చేశారు.
హమాలీల కష్టాన్ని గుర్తించిన కేసీఆర్ ప్రభుత్వం కూలీ రేట్లను రూ.8 నుంచి రూ.26కు పెంచిందని, దాదాపు 250 శాతం పెంపు సాధించడం బీఆర్‌ఎస్ ప్రభుత్వ ఘనత అని తెలిపారు. గతంలో ఐదేళ్లకోసారి మాత్రమే కూలీ రేట్లు పెరిగేవని, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్లకోసారి రేట్లు సవరించడంతో హమాలీల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని చెప్పారు. 18వ ఆవిర్భావ దినోత్సవానికి ఆహ్వానించిన హమాలీ కార్మికులకు కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్, హమాలీల ప్రేమాభిమానాలకు రుణపడి ఉన్నానన్నారు.
హమాలీ కార్మికుల ఆరోగ్య భద్రతతో పాటు వారి అన్ని సమస్యలను ఒక్కటొక్కటిగా పరిష్కరించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ ప్రస్తుతం అధికారంలో లేకపోయినా ప్రజల మద్దతు ఏమాత్రం తగ్గలేదని, కష్టకాలంలో పార్టీ వెంట నిలిచిన ప్రతి కార్యకర్తను, నాయకుడిని కాపాడుకుంటామని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమని, అందరూ ఐకమత్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. మరో రెండేళ్లలో కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుని, తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగుదామని హమాలీ కార్మికులకు, ప్రజలకు పిలుపునిచ్చారు.
హమాలీ సంఘం నేత మనుమడి పేరు ‘కేసీఆర్’
హమాలీ సంఘం నేత శ్రీనివాస్.. తన కుమారుడు మహేందర్, కోడలు సుష్మితలకు 2025 సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం రోజున మనుమడు జన్మించాడు. తెలంగాణ చరిత్రలో ఆ రోజుకు ఉన్న ప్రాధాన్యతతో పాటు తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పోషించిన పాత్రను గుర్తు చేసుకుంటూ, రాబోయే తరాలు కూడా ఆయన సేవలను స్మరించాలనే సంకల్పంతో మనుమడికి ‘కేసీఆర్’ (కుర్మ చరణ్ రాజ్) అని పేరు పెట్టారు. హమాలీ మహాసభలో కేటీఆర్‌తో పంచుకున్నారు. బాలుడు మంచి భవిష్యత్తుతో ఎదగాలని కేటీఆర్ ఆశీర్వదించారు.






