సర్‌ను పొడిగించాలి
దేశ వ్యాప్తంగా ఒక వ్యక్తికి ఒకే ఓటు
విధానాన్ని ఎన్నికల కమిషన్ అమలు చేయాలి
అర్హులైన ప్రతీ ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండాలి
ఈసీని కలిసేందుకు త్వరలో ఢిల్లీకి బీఆర్‌ఎస్ ప్రతినిధి బృందం
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, జులై 6 (విజయక్రాంతి): సర్‌ను పొడిగించాలని, దేశ వ్యాప్తంగా ఒక వ్యక్తికి ఒకే ఓటు విధానాన్ని ఎన్నికల కమిషన్ అమలు చేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండాల్సిందేనని, అనర్హులను జాబితా నుంచి ఏరివేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఈసీని కలిసేందుకు త్వరలో ఢిల్లీకి బీఆర్‌ఎస్ ప్రతినిధి బృందం వెళ్తుందని కేటీఆర్ తెలిపారు.
బీఎల్‌ఓలు ఇచ్చిన సర్ ఫారంలను కేవలం ఏడు శాతం మంది మాత్రమే నింపి ఇచ్చారని, చివరి తేదీ అయిన జూలై 24 లోగా మిగతా 93 శాతం పూర్తవ్వడం అనుమానమేనని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితుల దృష్ట్యా సర్ గడువును పెంచాల్సిందేనని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) జరుగుతున్న తీరుపై సోమవారం తెలంగాణ భవన్‌లో పార్టీ నియమించిన ప్రత్యేక కమిటీ సభ్యులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ నియమించిన బీఎల్‌ఓలు చాలా చోట్ల సర్ ప్రక్రియ పై ఓటర్లకు సరైన అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాల్లో ఓటర్ల డూప్లికేషన్‌పై శ్రద్ధ పెడుతున్న ఎన్నికల కమిషన్ ఓకే ఓటరు వివిధ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల్లో ఉంటు న్నా పట్టించుకోవడం లేదన్నారు. ఒక వ్యక్తికి ఒకే చోట ఓటు ఉండాలనే నిబంధనను కఠినంగా అమలు చేయాలని, ఇందుకోసం ఇప్పటికే ఎన్నికల ప్రధానాధికారిని కలిసి వినతి పత్రం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
ఇదే డిమాండ్‌తో త్వరలోనే బీఆర్‌ఎస్ ప్రతినిధి బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలుస్తుందని వెల్లడించారు. బీఆర్‌ఎస్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా నియమిం చిన బీఎల్‌ఏలు బాగా పనిచేస్తున్నారని, ఇక ముందు కూడా అప్రమత్తంగా ఉండి అర్హులైన వారందరూ ఓటర్ల జాబితాలో ఉండేట్లు కృషిచేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 93కు పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఎల్‌ఏల కు అవగాహన కల్పించే సమావేశాలు జరిగాయని చెప్పారు. మిగతా నియోజకవర్గాల్లో కూడా త్వరలోనే మీటింగ్‌లు నిర్వహిస్తామన్నారు.
సర్‌పై వేసిన బీఆర్‌ఎస్ కమిటీ సభ్యులకు ఒక్కొక్కరికి ఒక్కో ఉమ్మడి జిల్లా బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్సీ ఎల్ రమణకు కరీంనగర్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్‌కు నల్లగొండ, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌కు రంగారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్‌కు ఖమ్మం, మన్నె క్రిశాంక్‌కు మెదక్, వై సతీష్‌రెడ్డికి వరంగల్, అభిలాష్ రంగినేనికి మహబూబ్ నగర్, ముజీబ్‌కు ఆదిలాబాద్, సుమిత్రానంద్‌కు నిజామాబాద్ అప్పగించి.. జిల్లాల్లో సర్ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్ ప్రధాన కా ర్యదర్శి రావుల చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.






