7 July, 2026 | 3:03 AM

పెండింగ్ డీఏలు విడుదల చేయాలి

07-07-2026 02:18 AM
  1. ఓపీఎస్‌ను పునరుద్ధరించాలి
  2. ఈహెచ్‌ఎస్ జీవో సవరణ చేయాలి
  3. సీఎస్‌కు సీపీఎస్ యూనియన్ అధ్యక్షుడు స్థితప్రజ్ఞ విజ్ఞప్తి

హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): 2023 నుంచి పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను ఒకేసారి విడుదల చేయాలని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలని, ఈహెచ్‌ఎస్ జి.ఓ 79లో సవరణలు చేయాలని సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజును సోమవారం సచివాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు.

2004 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన సీపీఎస్ విధానం ఉద్యోగుల పదవీ విరమణ అనంతరం సామాజిక భద్రతను పూర్తిగా దెబ్బతీసిందన్నారు. ఇప్పటికే పదవీ విరమణ చేసిన 2 వేల మంది సీపీఎస్ ఉద్యోగులు అత్యల్ప పెన్షన్‌తో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

దీంతో సీపీఎస్‌ను రద్దు చేసి వెంటనే పాత పెన్షన్ విధానంను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. పదవీ విరమణ చేసిన సీపీఎస్ ఉద్యోగుల నుంచి చివరి బేసిక్ పే ఆధారంగా 1.5 శాతం చందా వసూలు చేయాలనే నిబంధన తీవ్ర అన్యాయమని తెలిపారు. వీరికి ఉచిత వైద్య సౌకర్యం కల్పించేలా జి.ఓ. ఎంఎస్. నెం.79లో తక్షణ సవరణలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మల్లికార్జున్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు నరేందర్ రావు పాల్గొన్నారు.