కుక్కల దాడిలో గొర్రెలు మృతి
రైతుకు రూ.1.20 లక్షల నష్టం.
నిర్మల్ జులై 23, (విజయక్రాంతి): మామడ మండల కేంద్రంలో వీధి కుక్కలు గొర్రెల మందపై దాడి చేసి ఆరు గొర్రెలను చంపగా, మరో ఐదు గొర్రెలను తీవ్రంగా గాయపరిచాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన గొర్రెల కాపరి మేకం ఆశన్న తన గొర్రెల మందను ఎప్పటిలాగే ఇంటి వద్ద ఉంచాడు. బుధవారం అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా కుక్కలు మందపై దాడి చేసి ఆరు గొర్రెలను కరిచి చంపగా, మరో ఐదు గొర్రెలను తీవ్రంగా గాయపరిచాయి.
మృతిచెందిన, గాయపడిన గొర్రెల విలువ సుమారు రూ.1.20 లక్షలు ఉంటుందని బాధితుడు తెలిపాడు. నెల రోజుల క్రితం కూడా ఇదే మందలో 10 గొర్రెలు కుక్కల దాడిలో మృతి చెందాయని, వరుసగా జరుగుతున్న ఘటనలతో తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని వాపోయాడు. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరాడు. మండల కేంద్రంలో వీధి కుక్కల బెడద రోజురోజుకు పెరుగుతోందని, ప్రజలు, పశువుల భద్రత కోసం అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.






