23 July, 2026 | 5:15 PM

నిషేధిత పొగాకు ఉత్పత్తులపై సీసీఎస్ పోలీసుల దాడి

23-07-2026 04:00 PM

రూ.1,96,430 విలువైన గుట్కా, పొగాకు ఉత్పత్తులు స్వాధీనం.

భూపాలపల్లి టౌన్, జులై 23 (విజయక్రాంతి): భూపాలపల్లిలో నిషేధిత పొగాకు ఉత్పత్తులపై సీసీఎస్ పోలీసుల దాడి చేసి రూ.1,96,430 విలువైన గుట్కా, పొగాకు ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్,  ఆదేశాలతో జిల్లాలో నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. ఈ క్రమంలో భాగంగా గురువారం సీసీఎస్ పోలీసులు భూపాలపల్లి జిల్లా కేంద్రం లోని చాముండా జనరల్ స్టోర్స్, దుర్గా జనరల్ స్టోర్స్, పవన కృష్ణ కిరాణం దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

తనిఖీల్లో అంబర్, ఆర్‌ఆర్, అనార్, జేకే, మీరాజ్ తదితర నిషేధిత పొగాకు ఉత్పత్తులను అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు గుర్తించి, మొత్తం రూ.1,96,430 విలువైన పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నిషేధిత పొగాకు ఉత్పత్తులను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం భూపాలపల్లి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, మాట్లాడుతూ, ప్రజారోగ్యానికి హానికరమైన నిషేధిత పొగాకు ఉత్పత్తులను నిల్వ చేయడం, విక్రయించడం లేదా రవాణా చేయడం వంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని కోరారు.