సనత్‌నగర్‌లో ఎస్‌ఐఆర్ వార్డు సభలు
పాల్గొన్న కోట నీలిమ, డీసీ, ఈఆర్వో సుజాత
సికింద్రాబాద్, ఆగస్ట్ 27 (విజయక్రాంతి): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా సనత్నగర్ నియోజకవర్గంలోని నెహ్రు పార్క్ వద్ద వార్డు కార్యాలయంలో నిర్వహించిన వార్డు సభలో పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ, డీసీ, ఈఆర్వో సుజాతతో కలిసి పాల్గొన్నారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ.. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ప్రజాస్వామ్య పరిరక్షణలో ఎంతో కీలకమైనదని అన్నారు.
అర్హత ఉన్న ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ముఖ్యంగా 2026 అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకునే యువత ఫారం-6 ద్వారా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని, ఇప్పటికే జాబితాలో ఉన్న వారి పేరు, వయస్సు, చిరునామా, తల్లిదండ్రుల పేర్లు, ఫొటో తదితర వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే ఫారం-8 ద్వారా సవరణ చేసుకోవాలని సూచించారు.
అర్హత లేని వ్యక్తుల పేర్లు నమోదై ఉంటే నిబంధనల ప్రకారం ఫారం-7 ద్వారా అభ్యంతరాలు తెలియజేయవచ్చని తెలిపారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా గత ఓటరు జాబితాలతో ప్రస్తుత వివరాలను అనుసంధానం చేసే సమయంలో వివరాల్లో తేడాలు ఉన్నవారికి, మ్యాపింగ్ కాని ఓటర్లకు, ధ్రువీకరణ అవసరమైన వారికి అధికారులు నోటీసులు జారీ చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఆర్వో గాయత్రి దేవి, నాయకులు పాల్గొన్నారు.






