తెలంగాణలో శివసేనను బలోపేతం చేస్తాం
రాజ్యసభ పక్ష నేత ఎంపీ మిలింద్ దేవర
ముషీరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి): తెలంగాణలో శివసేన పార్టీని గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు బలోపేతం చేసి, రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తామని రాజ్యసభ పక్ష నేత, మాజీ కేంద్ర మంత్రి మిలింద్ దేవర తెలిపారు.
గురువారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో శివసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహారాష్ట్ర మోడల్ను తెలంగాణలో అమలు చేసేందుకు కృషి చేస్తామని, ప్రజా సమస్యలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని మిలింద్ దేవర తెలిపారు. శివసేన అధినేత ఏక్నాథ్ షిండే నాయకత్వంలో దేశవ్యాప్తంగా పార్టీని విస్తరిస్తామని, తెలంగాణలో ఇకపై మహారాష్ట్ర నాయకుల పర్యటనలు కొనసాగుతాయని చెప్పారు. తెలంగాణలో గోమాతను రాజ్యమాతగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
శివసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ మాట్లాడుతూ హుస్సేన్సాగర్కు ‘వినాయక్ సాగర్’ గా పేరు మార్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆ పేరును ప్రకటించే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, నిరుద్యోగులకు వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శివసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. సుధాకర్, హైదరాబాద్ పార్లమెంట్ కన్వీనర్ రమేష్, మల్కాజ్గిరి పార్లమెంట్ కన్వీనర్ రాజారావు, సంగారెడ్డి జిల్లా నాయకులు లక్ష్మణ్, యువసేన రాష్ట్ర నాయకులు సాయి, మారుతి, విష్ణు, అఖిల్, వెంకటేష్, రాహుల్, లింగం తదితరులు పాల్గొన్నారు.






