26 June, 2026 | 3:32 AM

‘ఎస్‌ఐఆర్’ను పకడ్బందీగా నిర్వహించాలి

26-06-2026 12:00 AM

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) జూన్ 25 (విజయక్రాంతి): ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఓటర్ల నమోదు ప్రక్రియ సక్రమంగా నిర్వహించాలని భూపాలపల్లి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. గురువారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డు కారల్ మారక్స్ కాలనీ, 4వ వార్డు రాజీవ్ నగర్ కాలనీలలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి బూత్ స్థాయి అధికారులు వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేసి, ఓటర్లకు అవసరమైన అవగాహన కల్పించాలని సూచించారు.

ఓటర్లు సమర్పించిన ఫారాలను ఎప్పటికప్పుడు డేటా ఎంట్రీ చేసి నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన బీఎల్‌ఏలను భాగస్వామ్యం చేయాలని, ప్రక్రియ పారదర్శకంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే గ్రామాలు, మున్సిపాలిటీ పరిధిలో ప్రతి రోజు చెత్త సేకరణ వాహనాల ద్వారా చాటింపు నిర్వహిస్తూ ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మీరాజయ్య జీపీఓ కిరణ్, ఎన్యూమరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.