14 July, 2026 | 7:37 PM

మంథనికి సింగరేణి మెడికల్, మైనింగ్ కళాశాలలు మంజూరు చేయాలి

14-07-2026 07:07 PM

కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి బీజేపీ నేత చంద్రుపట్ల సునీల్ రెడ్డి వినతిపత్రం

మంథని,(విజయక్రాంతి): మంథని నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, సింగరేణి ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల లేదా మైనింగ్ కళాశాలను ఏర్పాటు చేయడంతో పాటు సింగరేణికి అనుబంధంగా పరిశ్రమలను స్థాపించి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని బీజేపీ పెద్దపల్లి జిల్లా మాజీ అధ్యక్షుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని కోరారు. మంగళవారం కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంథని ప్రాంతం సింగరేణి బొగ్గు గనులకు అత్యంత సమీపంలో ఉన్నప్పటికీ విద్యా, పారిశ్రామిక రంగాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదన్నారు.

తాడిచర్ల ఓసీపీతో పాటు ఆర్జీ-2, ఆర్జీ-3, ఓసీపీ-2 వంటి గనుల ప్రాంతాలకు ఆనుకుని ఉన్న మంథనిలో సింగరేణి మెడికల్ కళాశాల లేదా మైనింగ్ కళాశాల ఏర్పాటు చేస్తే స్థానిక విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుందని తెలిపారు. మైనింగ్, వైద్య విద్య కోసం విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, మంథనిలోనే ఈ విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తే విద్యతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి కూడా ఊతం లభిస్తుందని పేర్కొన్నారు.

అదేవిధంగా సింగరేణి కోల్ మైన్స్‌కు అనుబంధంగా పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక నిరుద్యోగ యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ప్రస్తుతం పరిశ్రమలు లేకపోవడంతో చదువుకున్న యువత హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి నగరాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మంథని ప్రాంతానికి చారిత్రక, రాజకీయ ప్రాధాన్యం ఉన్నప్పటికీ పరిశ్రమలు, ఉన్నత విద్యాసంస్థల కొరత కొనసాగుతోందని పేర్కొన్న సునీల్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి మంథని అభివృద్ధికి అవసరమైన విద్యా, పారిశ్రామిక ప్రాజెక్టులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంథని నియోజకవర్గ బీజేపీ నాయకులు కూడా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.