14 July, 2026 | 7:47 PM

ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి

14-07-2026 07:35 PM

నిర్మల్,(విజయక్రాంతి): ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా విద్యాశాఖపై సంబంధిత అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ బోధన చేయాలన్నారు.

ప్రతి రోజు తప్పనిసరిగా మెనూ ప్రకారం భోజనం అందించాలని తెలిపారు. ఉపాధ్యాయులు ఖచ్చితంగా ఎఫ్ఆర్ఎస్ హాజరు నమోదు చేయాలని చెప్పారు. విద్యార్థులకు సబ్జెక్టుల వారిగా సులువుగా అర్థమయ్యే విధానాలు అవలంబిస్తూ విద్యా బోధన చేయాలని అన్నారు. వారి నైపుణ్యాలు పెరిగేవిధంగా సామూహిక చర్చల ద్వారా కొత్త విషయాలు నేర్చుకునే విధంగా ప్రోత్సహించాలని తెలిపారు. విద్యార్థుల సామర్థ్యాలు అంచనా వేయడానికి వారాల, నెలల వారిగా పరీక్షలు నిర్వహించాలన్నారు.

ఎప్పటికప్పుడు పోషకులతో సమావేశాలు నిర్వహిస్తూ ఉండాలన్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత విద్యార్థులు సబ్జెక్టులు చదువుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. తరచూ తరగతులకు రాని, చదువు మానేసిన విద్యార్థులను బడులకు తీసుకువచ్చే విధంగా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. వారి తల్లిదండ్రులతో మాట్లాడి సమస్యలు ఏంటో తెలుసుకోవాలన్నారు. ప్రతిరోజు ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు పూర్తిగా ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.