శ్రీనిధి రుణాల రికవరీని వేగవంతం చేయండి
జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): శ్రీనిధి ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలకు అందించిన రుణాల రికవరీని వేగవంతం చేసి, పెండింగ్‌లో ఉన్న డిఫాల్ట్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీనిధి జిల్లా జనరల్ బాడీ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, శ్రీనిధి వార్షిక క్రెడిట్ ప్లాన్ అమలు, రుణాల పంపిణీ, రికవరీ, డిఫాల్ట్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు అర్హత ఆధారంగా జీవనోపాధి కార్యక్రమాల కోసం రుణాలు అందిస్తున్నందున, వాటినీ సకాలంలో రికవరీ జరిగేలా క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని చెప్పారు. ప్రస్తుతం ఫార్మ్, నాన్‌ఫార్మ్ కార్యకలాపాలు, ప్రధానమంత్రి ముద్ర పథకం, రూఫ్‌టాప్ సోలార్ యూనిట్ల వంటి ప్రత్యేక పథకాల అమలుకు అవకాశాలు ఉన్నాయి.
అర్హులైన లబ్ధిదారులను గుర్తించి త్వరితగతిన రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి నెల మండలాల వారీగా రుణాల పంపిణీ, రికవరీ, పురోగతిపై సమీక్ష నిర్వహించాలని, మెరుగైన పనితీరు కనబరిచిన ఎ పి ఎం లు, మండల మహిళా సమాఖ్యలను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సత్కరిస్తామని కలెక్టర్ ప్రకటించారు. శ్రీనిధి అధికారులు సమావేశంలో జిల్లాలో వార్షిక క్రెడిట్ ప్లాన్ లక్ష్యం రూ.84 కోట్లుగా ఉండగా, ఇప్పటివరకు సుమారు రూ.9.34 కోట్ల రుణాలు మంజూరై 11.13 శాతం లక్ష్యం సాధించినట్లు వివరించారు.
ముసాపేట, రాజాపూర్, జడ్చర్ల, బాలానగర్ మండలాలు క్రెడిట్ పంపిణీలో ముందంజలో ఉండగా, రికవరీ శాతం తక్కువగా ఉన్న మండలాల్లో ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైని సాయి శివాని, డి.ఆర్.డి.ఓ నరసింహులు, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు నాయక్, డి.సి.ఓ కృష్ణ, శ్రీనిధి రీజినల్ మేనేజర్ వేణుగోపాల్, డి.పి.ఎం లు, ఎ.పి.ఎం లు, మండల మహిళా సమాఖ్య అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.






