విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: గోగుల సరిత
మేడిపల్లి,(విజయక్రాంతి): విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు గోగుల సరిత అన్నారు. మంగళవారం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ 9వ డివిజన్ మేడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను గోగుల సరిత, మేడిపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి, నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన ఆమె, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదల, విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్య అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. విద్యార్థులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, భోజన నాణ్యత, పరిశుభ్రత, పాఠశాల వసతులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాలలో సిబ్బంది కొరత ఉన్న విషయాన్ని తెలుసుకున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు తెలిపిన సమస్యలను నమోదు చేసుకుని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం తుంగతుర్తి రవి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. పాఠశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బలరాం, మహ్మద్ మజర్, ప్రణయ్, బర్రె నాగరాజు, సోమయ్య, కాటపాక కుమార్, సునిల్, శరత్ గౌడ్, మేడిపల్లి మండల ఎంఈఓ శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్య ప్రసాద్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






