14 July, 2026 | 8:05 PM

గజ్వేల్ బీజేపీలో ముసలం?

14-07-2026 07:37 PM

- జిల్లా కమిటీకి భిన్నంగా నియోజకవర్గ కమిటీ ఏర్పాటు చేసిన సీనియర్ నేతలు

గజ్వేల్: గజ్వేల్ బీజేపీలో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఇటీవల ఏర్పాటు చేసిన జిల్లా కమిటీపై అసంతృప్తి వ్యక్తం చేసిన కొందరు సీనియర్ నాయకులు, తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కమిటీని నియమించారని ఆరోపించారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో జిల్లా నాయకుడు కొడిక్యాల రాములు మాట్లాడుతూ, పార్టీ కోసం మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్న తమను కమిటీల ఏర్పాటులో పూర్తిగా పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే నియోజకవర్గ స్థాయిలో 60 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, ఆ జాబితాను పార్టీ అధిష్ఠానానికి పంపినట్లు తెలిపారు.

పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశామని, కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ గజ్వేల్ నుంచి పోటీ చేసిన సమయంలో పార్టీ బలోపేతానికి కృషి చేసి గతంతో పోలిస్తే ఓట్ల శాతాన్ని పెంచామని చెప్పారు. తాము ఏర్పాటు చేసిన కమిటీయే గజ్వేల్ నియోజకవర్గంలో కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ పరిణామం గజ్వేల్ బీజేపీలో అంతర్గత విభేదాలకు దారితీసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.