28 February, 2026 | 12:34 PM

కేబీఆర్ పార్క్ చుట్టూ సిగ్నల్ ఫ్రీ ప్రయాణం

28-02-2026 12:27 AM

ముగ్ధ జంక్షన్ స్టీల్ ఫ్లైఓవర్ పనుల పరిశీలించిన సీపీ సజ్జనార్

జూబ్లీహిల్స్, ఫిబ్రవరి 27(విజయక్రాంతి): నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం చూపేలా ’హెచ్-సిటీ’ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని ముగ్ధ జంక్షన్ వద్ద చేపట్టిన స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

జీహెచ్‌ఎంసీ, మెఘా ఇంజినీరింగ్ ప్రతినిధులతో కలిసి ఆయన నిర్మాణ పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. కేబీఆర్ పార్క్ చుట్టూ రాబోయే రెండేళ్లలో మొత్తం ఏడు ఫ్లైఓవర్లు, అండర్ పాస్లను నిర్మించి ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో సిగ్నల్ ఫ్రీ జోన్గా మార్చడమే లక్ష్యమని వెల్లడించారు. శుక్రవారం రాత్రి నుంచే ముగ్ధ జంక్షన్ నుంచి కేబీఆర్ పార్క్ వైపు ఆరు పిల్లర్ల నిర్మాణ పను లు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ పనులను దశలవారీగా, ప్రణాళికబద్ధంగా చేపడుతున్నట్లు వివరించారు.

వాహనదారులకు అంతరాయం కలగకుండా పునాది పనులను ముమ్మరంగా రాత్రివేళల్లోనే నిర్వహించనున్నట్లు సీపీ స్పష్టం చేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పూర్తయితే నగరం పశ్చిమ, తూర్పు, మధ్య ప్రాంతాల మధ్య రాకపోకలు అత్యంత వేగంగా సాగుతాయని తెలిపారు. కేబీఆర్ పార్క్ పరిసరాలు ట్రాఫిక్ రహితంగా మారి, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నగర అభివృద్ధికి ప్రజలు అధికారులకు, సిబ్బందికి సహకరించాలని కోరారు. జాయింట్ సీపీలు జోయల్ డెవీస్, విజయకుమార్, డీసీపీ కాజల్ పాల్గొన్నారు.