బల్కంపేట ఆలయంలో ఆకస్మిక తనిఖీలు
తనిఖీ చేసిన మంత్రి కొండా సురేఖ
సనత్నగర్ ఫిబ్రవరి 27 (విజయక్రాంతి):- బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ ఆలయంలో మంత్రి కొండా సురేఖ, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమతో కలిసి శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లడ్డూ ప్రసాద కౌంటర్, ప్రధాన బుకింగ్ కౌంటర్, ఆలయ రికారడ్స్ రూమ్, EO, సూపరింటెండెంట్ ఆఫీస్, కొత్తగా కడుతున్న పార్కింగ్ కాంప్లెక్స్, భక్తుల క్యూ లైన్స్ తదితర ప్రదేశాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ... బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ ఆలయంపై భారీ ఎత్తున ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో అమ్మవారిని సైతం దర్శించుకోకుండా నేరు గా అడ్మినిస్ట్రేషన్ రూమ్‌కు వెళ్లి రికార్డులు పరిశీలించామన్నారు. అనంతరం లడ్డు, పులిహోర తయారీ విధానం గురించి అక్కడ పాటిస్తున్న శుభ్రతపై ఆరా తీశామన్నారు.
లడ్డు, పులిహోర, ఆయిల్, నెయ్యి శాంపిల్‌ను టెస్ట్ కోసం పంపించామన్నారు. ఈ క్రమంలో 200 గ్రాములు ఉండాల్సిన పులిహోర పాకెట్ 150 గ్రాములే ఉండటాన్ని గుర్తించారు. మరోవైపు ప్రసాదం తయారీ రూమ్ శుభ్రంగా లేకపోవడాన్ని గుర్తించి రూమ్ ను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు. దేవాలయ ప్రాంగణం శుభ్రంగా ఉంచేలా చూడమన్నా రు.
ఇంకోవైపు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ముగ్గురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులని, ఒక పూజారిని విధుల నుంచి తొలగించినట్టు పేర్కొన్నారు. రికార్డుల్లో ఏదైనా అవకతవకలు జరిగినట్టు తేలితే అందరిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దేవుడి సన్నిధిలో అవినీతి చేసినట్టు వెల్లడైతే ఉపేక్షించేది లేదన్నారు. తెలంగాణ దేవాలయాల అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని.. అందులో భాగంగానే బల్కంపేట ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారన్నారు




