ముమ్మరంగా శివాలయ పునరుద్ధరణ పనులు
కాకతీయుల కాలం నాటి కాట్రపల్లి శివాలయం
కేసముద్రం, జులై 26 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలో కాకతీయుల కాలం నాటి శివ కోటేశ్వరాలయం పునరుద్ధరణ పనుల్లో భాగంగా ఆలయాన్ని పూర్తిగా తొలగించారు. శనివారం ఏకాదశి పర్వదిన సందర్భంగా పూజలు నిర్వహించి, ఆదివారం ఆలయంలోని నంది విగ్రహం, పానవట్టంతో సహా శివ లింగాన్ని బయటకు తీసి ఆలయ పునరుద్ధరణ పనులను చేపట్టారు.
సుమారు 1200 సంవత్సరాల క్రితం కాకతీయుల కాలంలో కాట్రపల్లి గ్రామంలో పెద్ద తటాకం నిర్మించడంతో పాటు రామప్ప, వేయి స్తంభాల దేవాలయంలో మాదిరిగానే శివలింగం, నంది విగ్రహాలతో కూడిన రాతిశిలలతో ఆనాటి శిల్ప సౌందర్యంతో ఆలయాన్ని నిర్మించారు. అయితే కాలక్రమేనా ఆలయం పూర్తిగా దెబ్బ తినడం వల్ల తన ప్రభావాన్ని కోల్పోయింది. 100 సంవత్సరాల క్రితం ఆలయంలో పూజలు నిలిచిపోవడంతో గత కొన్నేళ్ల క్రితం గ్రామస్తులు ఏకమై ఆలయాన్ని తిరిగి వినియోగంలోకి తెచ్చారు.
ఈ క్రమంలో కేసముద్రం మండలానికి చెందిన మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారుగా నియమితులు కావడం, రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవ్వడం జరిగింది. దీనితో చారిత్రాత్మకమైన కాట్రపల్లి శివాలయాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ఆయన ప్రత్యేక చొరవ చూపారు. దీనితో ప్రభుత్వం కాట్రపల్లి శివాలయ పునరుద్ధరణ కోసం 4.50 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఇటీవల ఆలయ పునరుద్ధరణ పనులకు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆలయ ప్రాకారాన్ని, ఆలయాన్ని పూర్తిగా ప్రత్యేక యంత్రాలతో తొలగించిన తర్వాత ఆదివారం ముఖ్యమైన నంది విగ్రహం, శివలింగం తీసి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేశారు. పూర్తిగా ఆనాటి రాతిశీలలతోనే ఆలయ నిర్మాణాన్ని, యధావిధిగా సరికొత్తగా పునరుద్ధరించడానికి చర్యలు తీసుకున్నారు.






