21 July, 2026 | 8:55 AM

విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి: షీటీం ఎస్ఐ ఫజల్ ఖాన్

20-07-2026 06:50 PM

ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో షీ టీం అవగాహన సదస్సు

భూపాలపల్లి,(విజయక్రాంతి): విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలని షీ టీం ఎస్ఐ ఫజల్ ఖాన్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాలతో జిల్లా షీ టీం ఆధ్వర్యంలో ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీం ఎస్సై ఫజల్ ఖాన్ మాట్లాడుతూ విద్యార్థినులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, మహిళలపై వేధింపులు, స్ట్రీట్ హరాస్మెంట్, వ్యక్తిగత భద్రత, సైబర్ నేరాల నివారణపై అవగాహన కల్పించారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వీడియో కాల్స్‌కు స్పందించవద్దని, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచించారు.

విద్యార్థినులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని అన్నారు. తమ పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని గుర్తించి క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు. పాఠశాల పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, ఎవరైనా మహిళలు లేదా బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా వెంటనే షీ టీంకు సమాచారం అందించాలని కోరారు. షీ టీం మొబైల్ నంబర్ 8712658162కు ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్-100 సేవలను వినియోగించాలని, సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని వివరించారు.