జంట హత్యల కేసులో నిందితులకు కఠిన శిక్ష
బాధిత కుటుంబానికి రూ.4,12,500 పరిహారం అందజేత
ఫాస్ట్ట్రాక్ కోర్టుకు కేసు.. త్వరగా శిక్ష పడేలా చర్యలు
డీఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు.. స్పెషల్ అడ్వకేట్ సహకారం
కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ
మోతె, ఆగస్టు 25: మండలంలోని బిక్యాతండాలో దారుణ హత్యకు గురైన దంపతులు నాగులు, బుబా కుటుంబానికి జిల్లా యంత్రాంగం అండగా నిలిచింది. మంగళవారం జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎస్పీ నరసింహ బాధితుల ఇంటికి వెళ్లి వారి కుమార్తెలు జ్యోతి, సంధ్యలను పరామర్శించి ఓదార్చారు. అట్రాసిటీ కేసు కింద అందాల్సిన ఆర్థిక సాయంలో మొదటి విడతగా 50 శాతం రూ.4.12,500 బాధితుల ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు.
దీనికి సంబంధించిన ఉత్తర్వులను కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..ఘటన అత్యంత బాధాకరమన్నారు. బాధిత కుటుంబానికి జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేసులో ప్రతి ఆధారాన్ని పోలీసులు నిశితంగా సేకరిస్తున్నారని, త్వరగా చార్జ్షీట్ సిద్ధం చేసి కోర్టుకు పంపిస్తామని తెలిపారు. నిందితులకు వీలైనంత త్వరగా కఠినంగా శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఎస్పీ నరసింహ మాట్లాడుతూ.. హత్య జరిగిన 24 గంటలు గడవకముందే నిందితులను గుర్తించి రిమాండ్కు తరలించామన్నారు. లోతైన దర్యాప్తు కోసం డీఎస్పీని దర్యాప్తు అధికారిగా నియమించినట్లు తెలిపారు. నిందితులను పోలీస్ కస్టడీలోకి తీసుకుని అన్ని కోణాల్లో విచారించి పక్కా ఆధారాలు సేకరిస్తామన్నారు.
బాధితులకు న్యాయం జరిగేలా నిపుణులైన స్పెషల్ అడ్వకేట్ సహకారం తీసుకుంటున్నామని, కేసును ఫాస్ట్ట్రాక్ కోర్టుకు పంపించి త్వరగా విచారణ పూర్తయ్యేలా కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ప్రసన్నకుమార్, శ్రీనివాస్రెడ్డి, ఆర్డీవో వేణుమాధ వ్, తహసీల్దార్ వెంకన్న, సీఐ రామకృష్ణారెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, మోతె ఎస్త్స్ర లచ్చిరెడ్డి, మాజీ జెడ్పిటిసి మాతృనాయక్, సర్పంచ్ హలవత్ స్వామి నాయక్ తదితరులు పాల్గొన్నారు.






