జల క్షామం.. అల్లాడుతున్న జనం!
రాజధానిలో తీవ్ర తాగునీటి సంక్షోభం
వేసవి సీజన్‌లో ఎండిపోయిన 12వేల బోరు బావులు
రోజుకు 20 వేల ట్యాంకర్ల బుకింగ్స్
ప్రైవేట్ మాఫియా చేతుల్లో నీటి దోపిడీ ఏ. చంద్రశేఖర్ రావు
సంగారెడ్డి, జూలై 1 (విజయక్రాంతి): భాగ్యనగరం తీవ్ర నీటి ఎండగట్టిలో చిక్కుకుంది. హైదరాబాద్ జలమండలి అంతర్గత నివేదికల ప్రకారం.. నగరవ్యాప్తంగా కేవలం ఈ వేసవి సీజన్ ముగిసే సమయానికి దాదాపు 12వేల అపార్ట్‌మెంట్లు, రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లోని బోరుబావులు పూర్తిగా ఎండిపోయాయి. నగర చరిత్రలో ఇంత పెద్ద సంఖ్యలో బోరుబావులు అడుగంటడం ఇదే తొలిసారిగా రికార్డులకు ఎక్కింది. జూన్ నెల ముగిసినా వానలు సరిగ్గా కురవకపోవడంతో భూగర్భ జలమట్టాలు పాతాళానికి పడిపోయాయి.
ప్రస్తుతం నగరంలో నీటి ట్యాంకర్ల కోసం డిమాండ్ రికార్డు స్థాయిలో రోజుకు 20వేలు బుకింగ్స్‌కు చేరింది. ప్రైవేట్ ట్యాంకర్ల యా జమాన్యాలు ఒక్కో ట్యాంకర్‌కు రూ.1,500 నుంచి రూ.2,500 వరకు వసూలు చేస్తూ సామాన్యులను అడ్డగోలుగా దోచుకుం టున్నాయి. ఐటీ కారిడార్‌లోని గచ్చిబౌలి, కొండాపూర్, మణికొండ, మియాపూర్ పరిసర ప్రాంతాల్లో ఐటీ ఉద్యోగులు, స్థానికులు నీటి కోసం నిత్యం యుద్ధాలు చేయాల్సి వస్తోంది.
పాతాళానికి పడిపోయిన జలాలు.. ఎండిన రిజర్వాయర్లు
నగర తాగునీటి అవసరాలను తీర్చే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, సింగూరు, మంజీర జలాశయాల్లో నీటి మట్టాలు క్రమంగా అడుగంటుతున్నాయి. కృష్ణా, గోదావరి జలాల నుంచి నీటిని తరలిస్తున్నప్పటికీ, అంతర్గత పైప్లైన్ల లోపాలు, సరఫరాలో ఆలస్యం వల్ల నగర శివార్లలోని కాలనీలకు వారానికి ఒక్కరోజు కూడా నీళ్లు రావడం లేదు. బోరుబావుల నమ్మకం పూర్తిగా పోవడంతో ప్రజలు పూర్తిగా జలమండలి సరఫరా చేసే ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు.
అధికారుల లెక్కల ప్రకారం 12 వేలు పైగా నగరంలో అపార్ట్‌మెంట్ల బోరుబావులు ఎండిపోయాయి. జలమండలికి ప్రతిరోజూ వస్తున్న ట్యాంకర్ల బుకింగ్స్ 20వేలు పైబడే ఉంటున్నాయి. హైదరాబాద్ నగర వాస్తవ రోజువారీ నీటి అవసరం 750 మిలియన్ గ్యాలన్ల పర్ డే (ఎంజీడీ) కాగా ప్రస్తుతం జలమండలి 620 ఎంజీడీ నీటిని సరఫరా చేయగలుగుతుంది.
రెచ్చిపోతున్న ప్రైవేట్ ట్యాంకర్ల మాఫియా
ప్రభుత్వ ట్యాంకర్ బుక్ చేస్తే రావడానికి కనీసం 3 నుంచి 5 రోజులు పడుతోంది. ప్రైవేట్ ట్యాంకర్ల యజమానులు దందాకు తెరలేపారు. ఐటీ కారిడార్‌లోని గేటెడ్ కమ్యూనిటీల నుంచి నెలకు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు ప్రైవేట్ ట్యాంకర్లపై ధరల నియంత్రణ విధించకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు.
వర్షపు నీటి సంరక్షణే ఏకైక మా ర్గమైన భూగర్భ జలాలు ఇంత వేగంగా పడి పోవడానికి అడ్డగోలు కాంక్రీట్ నిర్మాణాలు, ’రెయిన్ వాటర్ హార్వెస్టింగ్’ (ఇంగుడు గుంతలు) విధానాన్ని విస్మరించడమే కా రణమని నిపుణులు హెచ్చరి స్తున్నారు.
ఎండుతున్న మెతుకుసీమ...
రాజధానికి తాగునీరు అందించే ఉమ్మడి మెదక్ జిల్లా ఇప్పుడు స్వయంగా తీవ్ర నీటి ఎండగట్టిని ఎదుర్కొంటోంది. జూన్ ముగిసినా ఆశించిన స్థాయిలో వానలు కురవక పోవడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. భూగర్భ జల శాఖ తాజా నివేదికల ప్రకారం.. గత ఏడాదితో పోలిస్తే జిల్లాలోని వివిధ మండలాల్లో భూగర్భ జలమట్టాలు సగటున 3.5 నుండి 4.5 మీటర్ల మేర లోతుకు పడిపోయాయి.
ముఖ్యంగా జహీరాబాద్, నారాయణఖేడ్, గజ్వేల్, దుబ్బాక ప్రాంతాల్లో బోరుబావులు పూర్తిగా వట్టిపోయాయి. కాగా ఉమ్మడి జిల్లాకు తాగునీరు, సాగునీరు అందించే సింగూరు ప్రాజెక్టు, మంజీర బ్యా రేజీలు అడుగంటుతున్నాయి. సింగూరులో నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరువవుతుండటంతో నారాయణఖేడ్, అందోల్ నియోజ కవర్గాల్లోని వందలాది గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది.
పారిశ్రామిక ప్రాంతమైన పటాన్చెరు, బొల్లారం పరిసరా ల్లోని భూగర్భ జలాలు రసాయనాలతో కలుషితం కావడంతో, అక్కడ తాగునీటి కోసం సామాన్యులు ప్రైవేట్ ట్యాంకర్లపై నెలకు రూ.3వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నా, అంతర్గత పైప్లైన్ల లీకేజీల వల్ల సగానికి పైగా నీరు వృథాగా రోడ్లపైకి చేరుతోంది.సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో కలుషిత జలాలు, జహీరాబాద్ ప్రాంతంలో బోర్లు ఫెయిల్ కావడం, నారాయణఖేడ్ ప్రాంతంలో రవాణా ద్వారా నీటి సరఫరా చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. పటాన్‌చెరు పారిశ్రామిక నియోజకవర్గం ఇప్పుడు ప్రైవేట్ నీటి ట్యాంకర్ల మాఫియాకు అడ్డాగా మారింది.
ఇక్కడి భూగర్భ జలాలు రసాయన వ్యర్థాల వల్ల పూర్తిగా కలుషితం కావడంతో స్థానిక బోరు బావుల నీరు తాగేందుకు, కనీసం వాడుకునేందుకు కూడా పనికిరావడం లేదు. రూ.800 నుంచి రూ. వెయ్యి పలికే 5వేల లీటర్ల నీటి ట్యాంకర్ ధర ప్రస్తుత రూ.2వేల నుంచి రూ.2,500 వరకు పెంచేశారు. ఒక్కో అపార్ట్మెంట్ అసోసియేషన్ నుంచి నీటి సరఫరా కోసం నెలకు రూ.15వేల నుంచి రూ.20వేల వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. స్థానిక మున్సిపల్ అధికారులు, జలమండలి యంత్రాంగం కళ్లారా చూస్తున్నా పట్టించుకోవడం లేదని స్థానిక కాలనీల వాసులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.






