30 May, 2026 | 1:03 AM

కొయ్యలకు నిప్పు.. భూసారానికి ముప్పు!

30-05-2026 12:00 AM

వరి కొయ్యల దహనంతో పెరుగుతున్న అగ్నిప్రమాదాలు  నష్టపోతున్న రైతే..

భిక్కనూర్, మే 29 (విజయ క్రాంతి): యాసంగి వరి కోతలు పూర్తికాగానే పొలాల్లో మిగిలిపోయే వరి కొయ్యలను తగులబెట్టడం రైతుల్లో సాధారణంగా మారిపోయింది. పొలాన్ని త్వరగా ఖరీఫ్ సాగుకు సిద్ధం చేయాలనే ఆలోచనతో కొయ్యలకు నిప్పు పెడుతున్నా, దాని వల్ల భూసారం దెబ్బతినడమే కాకుండా పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ చాలా చోట్ల రైతులు వరి కొయ్యలను కాల్చడం కొనసాగుతూనే ఉంది.

హార్వెస్టర్లతో పెరిగిన సమస్య

ప్రస్తుతం ఎక్కువగా హార్వెస్టర్ మిషన్లతో వరి కోతలు చేపడుతున్నారు. ఈ యంత్రాలు పంటను పై భాగంలో కోయడంతో పొలాల్లో పెద్ద ఎత్తున కొయ్యలు మిగిలిపోతున్నాయి. గతంలో ఈ గడ్డిని రైతులు పశువుల మేతగా నిల్వ చేసుకునేవారు. కానీ పశుసంవర్ధకంపై ఆసక్తి తగ్గడం, పశువుల సంఖ్య తగ్గిపోవడంతో గడ్డిని ఉపయోగించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో పొలంలో మిగిలిన కొయ్యలను రైతులు తగులబెడుతున్నారు.

భూసారం కోల్పోతున్న నేలలు

వరి కొయ్యలను కాల్చడం వల్ల నేలలో సహజంగా ఉండే సూక్ష్మజీవులు నశిస్తున్నాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. పంటలకు అవసరమైన పోషకాలు నేలలో తగ్గిపోవడంతో భూమి సారవంతత క్రమంగా దెబ్బతింటోంది. తద్వారా దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎరువులు వేసినా మొక్కలకు సరైన పోషకాలు అందక రైతులు మరింత ఖర్చు పెట్టాల్సి వస్తోందని తెలిపారు.

పెరుగుతున్న అగ్నిప్రమాదాలు

ఎండ తీవ్రత, గాలి వేగం కారణంగా కొయ్యలకు పెట్టిన మంటలు ఒక్కసారిగా అదుపు తప్పి సమీప పొలాలకు వ్యాపిస్తున్నాయి. దీంతో భారీ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుని రైతులు ఆస్తి, పంట నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. కొన్నిసార్లు విద్యుత్ స్తంభాలు, చెట్లు, పశువుల మేత కూడా మంటల్లో కాలిపోతున్నాయి. కొన్ని ఘటనల్లో రైతుల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుతోంది.

వాయు కాలుష్యానికి కారణం

కొయ్యలను కాల్చడం వల్ల గాల్లో పొగమంచు, కార్బన్ వాయువులు అధికమై వాతావరణ కాలుష్యం పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో శ్వాసకోశ సమస్యలు కూడా ఎక్కువయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రకృతి సమతుల్యత దెబ్బతినడంతో పాటు భవిష్యత్ తరాలకు ముప్పు ఏర్పడుతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కలియదున్నితేనే మేలు

వరి కొయ్యలను తగులబెట్టడం కంటే పొలంలోనే కలియదున్నడం ద్వారా అవి సహజ ఎరువులుగా మారి భూమికి మేలు చేస్తాయని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అలాగే కొయ్యలను పశువుల మేతగా, సేంద్రీయ ఎరువుల తయారీలో ఉపయోగించుకోవచ్చని చెబుతున్నారు. రైతులు పర్యావరణాన్ని కాపాడే విధంగా ఆలోచించి కొయ్యల దహనాన్ని నివారించాలని అధికారులు కోరుతున్నారు.

రైతులకు అవగాహన కల్పిస్తున్నాం

వరి కొయ్యలను కాల్చరాదని రైతులకు నిరంతరం అవగాహన కల్పిస్తున్నాం. కొయ్యలను పొలంలోనే కలియదున్నితే అవి కొద్ది రోజుల్లో కుళ్లిపోయి సహజ ఎరువులుగా మారతాయి. తద్వారా ఎరువుల వాడకం కూడా తగ్గుతుంది. కాల్చడం వల్ల భూమి సారం తగ్గిపోవడంతో పాటు నేలకు మేలు చేసే సూక్ష్మజీవులు, కీటకాలు నశిస్తాయి. వాయు కాలుష్యం పెరిగి పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. రైతులు కొయ్యలను కాల్చకుండా ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించాలి అని వ్యవసాయ అధికారి నాగార్జున రెడ్డి సూచించారు.

 - భిక్కనూర్ మండల వ్యవసాయ అధికారి నాగార్జున రెడ్డి