23 August, 2026 | 4:34 AM

భజనలతో మారుమోగిన కొండలయ్య గుట్ట

23-08-2026 12:55 AM

శ్రావణ శోభతో పునీతమైన క్షేత్రం

భక్తులకు మంచినీరు, అన్నదాన ఏర్పాట్లు చేసిన శ్రీ విశ్వకర్మ గాయత్రి ఆశ్రమ ట్రస్ట్

వనపర్తి: జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న పెద్దమందడి మండలం జగత్ పల్లి కొండలయ్య గుట్ట శ్రావణ రెండో శనివారం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భజన కీర్తనలతో, భక్తుల జయజయధ్వానాలతో గుట్ట మారుమోగింది. రెండున్నర దశాబ్దాల తర్వాత కొండలయ్య గుట్టకు పూర్వ వైభవం రావడంతో భక్తులు పులకించిపోయారు. శ్రీ విశ్వకర్మ గాయత్రి ఆశ్రమ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు మంచినీటి వసతి, అన్నదానం ఏర్పాటు చేశారు.

అచ్యుతాపురం,రాజపేటకు చెందిన భజన భక్త బృందం గుట్టపైకి చేరుకొని భక్తి గీతాలు ఆలపించడంతో ఆ ప్రాంతమంతా భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. మహిళలు బొడ్డెమ్మలు వేస్తూ భక్తి గీతాలు ఆలపించారు. వందలాది మంది భక్తులు బారులు తీరి స్వామి వారిని దర్శించుకున్నారు. జగత్ పల్లి, అచ్యుతాపురం, రాజనగరం, నాగవరం, రాజపేట గ్రామాల భక్తులు ఈ ఏర్పాట్ల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ విశ్వకర్మ గాయత్రి ఆశ్రమ నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

కార్యక్రమంలో శ్రీ విశ్వకర్మ గాయత్రి ఆశ్రమ ట్రస్ట్ నిర్వాహకులు అరుణ్ కుమార్ స్వామి, సర్పంచ్ పెంటన్న యాదవ్, మాజీ సర్పంచ్ లు నిరంజన్ గౌడ్, మోహన్ కుమార్ యాదవ్, మాజీ గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షులు పెండెం కురుమూర్తి యాదవ్, విశ్రాంత ఎంపీడీవో రవీంద్రబాబు, విశ్రాంత ఉపాధ్యాయులు బూరుగుపల్లి శేఖర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ బుచ్చన్న నాయుడు, రవీందర్ యాదవ్, సుధాకర్ యాదవ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.