మే 23 నుంచి విత్తన వారోత్సవాలు
బిజినేపల్లి, మే 19 నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ఈ నెల 23 నుంచి 30 వరకు విత్తన వారోత్సవాలు నిర్వహించనున్నట్లు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పరిశోధన సహాయ సంచాలకులు డాక్టర్ ఎల్. కృష్ణ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఈ విత్తన వారోత్సవాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
రైతులకు వివిధ పంటల్లో మేలైన రకాలు, నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ సందర్భంగా వరి, కంది, మినుములు, జొన్నలు, రాగులు, ఆముదం పంటలకు చెందిన మెరుగైన విత్తన రకాలు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థావరంలో అందుబాటులో ఉంటాయని చెప్పారు. అలాగే తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, మహబూబ్నగర్లో కూడా వరి, జొన్న విత్తనాలు పరిమిత మొత్తంలో లభిస్తాయని తెలిపారు.
వరి ఆర్.ఎన్.ఆర్15048 తెలంగాణ సోనా10 కేజీలు రూ.770,వరి కె.ఎన్.ఎం.1638, 10 కేజీలు రూ.750, జొన్న పి.వై.పి.ఎస్2 పాలెం పచ్చ జొన్న 3 కేజీలు రూ.600, జొన్న సి.ఎస్.వి41, 3 కేజీలు రూ.300,కంది పి.ఆర్.జి176 (ఉజ్వల), 3 కేజీలు రూ.600, కంది టి.డి.ఆర్.జి.59, 3 కేజీలు రూ.600, ఆముదం పి.సి.హెచ్.111, 2 కేజీలు రూ.850,రాగి పి.ఆర్.ఎస్.38, 2 కేజీలు రూ.200,మినుములు ఎం.బి.జి.1070, 6 కేజీలు రూ.1080






