7 August, 2026 | 5:39 PM

వానాకాలం పంటలకు పోచారం ప్రాజెక్టు నీటి విడుదల

07-08-2026 04:47 PM

ప్రధాన కాలువ ద్వారా 10,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుకుని పొంగిపొర్లుతుండడంతో వానాకాలం పంటల సాగు కోసం ఇరిగేషన్ అధికారులు శుక్రవారం ప్రాజెక్టు గేట్లను ఎత్తి 150 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువ ద్వారా దిగువకు విడుదల చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకుల సమక్షంలో నీటి విడుదల చేపట్టారు. పోచారం ప్రాజెక్టు సామర్థ్యం 1.820 టీఎంసీలు కాగా,ప్రస్తుతం పూర్తిస్థాయిలో నిండుకుని పొంగిపొర్లుతోంది.

పోచారం ప్రధాన కాలువ ద్వారా సుమారు 10,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది.చెరువులు, కుంటలు నిండేందుకు వీలుగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.విడుదల చేసిన నీరు 15 రోజుల పాటు కొనసాగుతుందని, అనంతరం పది రోజుల పాటు నీటి విడుదల నిలిపివేస్తామని పేర్కొన్నారు. ఆయకట్టు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

పోచారం ప్రాజెక్టు,ప్రధాన కాలువకు సంబంధించి రూ.5.18 కోట్లతో పలు శాశ్వత మరమ్మతు పనులు చేపట్టేందుకు త్వరలో టెండర్లు పిలుస్తామని సూపరింటెండింగ్ ఇంజనీర్ యశస్వి తెలిపారు. పోచారం ప్రాజెక్టు కుడివైపు ఫ్లాంక్ బ్రిడ్జి వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ.1.243 కోట్లు,అప్రాన్,డివైడ్ వాల్, వీర్‌కు శాశ్వత మరమ్మతులకు రూ.2.34 కోట్లు,అడ్విలింగల్ వద్ద పోచారం మెయిన్ కెనాల్ దెబ్బతిన్న ఇన్‌లెట్, అవుట్‌లెట్ గోడల మరమ్మతులకు రూ.1.60 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

మరమ్మతు పనులు పూర్తయితే ప్రాజెక్టు, కాలువల భద్రత మరింత మెరుగుపడటంతో పాటు ఆయకట్టు రైతులకు సాగునీటి సరఫరాలో ఇబ్బందులు తగ్గుతాయని యశస్వి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఈ కిష్టయ్య, ఏఈఈ అక్షయ్, ఏఈఈ శరత్, జిల్లా ఉపాధ్యక్షుడు రామచందర్ రెడ్డి, తాండూర్ సొసైటీ చైర్మన్ ఆకిడి గంగారెడ్డి, కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్లు శ్రీనివాస్, డీవీటీ కిష్టయ్య, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మురళి గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు కొర్ర వాసురం, ఆత్మ కమిటీ డైరెక్టర్ లక్ష్మణ్ ఠాకూర్, తదితరులు పాల్గొన్నారు.