క్విట్ ఇండియా స్ఫూర్తితో జైలు భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మాచర్ల భారతి
సత్తుపల్లి.(విజయక్రాంతి): సిపిఎం పార్టీ సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి వర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో సత్తుపల్లి రావి వీర వెంకయ్య భవన్ చలమాల విఠల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మాచర్ల భారతి గారు మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జైలు భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మాచర్ల భారతి పిలుపునిచ్చారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చట్టబద్ధమైన హక్కుగా కాకుండా ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడే సంక్షేమ పథకంగా మార్చే ప్రయత్నం చేస్తోందని ఆమె విమర్శించారు. కార్మికుల రక్షణ కోసం ఉన్న కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మికుల హక్కులను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు.
రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మార్చే విధానాలను అవలంబిస్తోందని అన్నారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, సంక్షేమ పథకాలకు నిధుల కోత, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ జైలు భరో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ తదితర దేశాలతో కేంద్ర ప్రభుత్వం చేసుకుంటున్న వాణిజ్య ఒప్పందాలు దేశ ప్రయోజనాలకు, రైతాంగానికి నష్టం కలిగించే విధంగా ఉండకూడదని ఆమె అన్నారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులతో పాటు విద్యార్థులు, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు, మేధావులు ఆగస్టు 10న జరిగే జైలు భరో కార్యక్రమానికి మద్దతుగా నిలవాలని మాచర్ల భారతి కోరారు.
అదేవిధంగా పార్లమెంట్ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకాకుండా ముఖం చాటేస్తున్నారని ఆమె విమర్శించారు. విద్యార్థులపై జరిగిన లాఠీచార్జి, రామ మందిరం పేరుతో నిధుల వినియోగం, మహిళలపై జరుగుతున్న దాడులపై పార్లమెంట్ సాక్షిగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై ఉందన్నారు. ప్రజా సమస్యలపై పార్లమెంట్‌లో చర్చించి దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చలమాల విఠల్ రావు, మొరంపూడి పాండురంగారావు, జాజిరి శ్రీనివాస్, డివిజన్ కార్యదర్శివర్గ సభ్యులు కోలికపోగు సర్వేశ్వరరావు, అయినాల రామలింగేశ్వరరావు, తన్నీరు కృష్ణార్జునరావు, అరవపల్లి జగన్మోహన్ రావు, జాజిరి జ్యోతి, రావుల రాజబాబు, మల్లూరి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.






