31 July, 2026 | 3:27 AM

కాంగ్రెస్‌లో కుర్చీల ఖరారు!

31-07-2026 02:14 AM
  1. పదవుల పందేరానికి ఏఐసీసీ గ్రీన్‌సిగ్నల్
  2. రేపోమాపో జాబితా విడుదల 
  3. ఆశావహుల్లో ఉత్కంఠ

హైదరాబాద్ జూలై 30 (విజయక్రాంతి): రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదవుల పందేరానికి తెరలేవనుంది. ఏఐసీసీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టుల జాబితాను రేపోమాపో ప్రకటించే అవకాశం ఉందని  పార్టీ వర్గాలు వెల్లడించాయి. తొలుత టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రచార కార్యదర్శితో పాటు మిగతా పార్టీ పదవులు, ఆ తరువాత నామినేటెడ్ పోస్టుల జాబితా ప్రకటించనున్నట్లు తెలిసింది.  

ఈ వర్గాల నుంచి ఎంపిక?

టీపీసీసీ వర్కింగ్ పోస్టులను ఎస్సీ, ఎస్టీ, ఓసీ సామాజిక వర్గాల నుంచి ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఎస్టీల నుంచి మహబూబాద్ ఎంపీ బలరాంనాయక్, ఓసీల నుంచి భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, రోహిత్‌రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల కోసం ప్రముఖంగా పోటీ పడుతున్నారు. పార్టీ నామినేటెడ్ పోస్టులను కూడా ఒకటిరెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.

37 మంది కార్పొరేష న్ చైర్మన్ల పదవీకాలం ఇటీవలే ముగిసింది.ఈ 37 పోస్టులతో పాటు, అంతకుముందు ఖాళీగా ఉన్న ఆర్టీసీ, బేవరేజెస్ వంటి కీలక కార్పొరేషన్లకు కూడా చైర్మన్లను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఆయా పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. రెండుమూడు రోజుల్లో జాబితా ప్రకటించే అవకాశం ఉండటంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.