4 May, 2026 | 9:15 PM

కోతుల బెడదను నివారించిన సర్పంచ్

04-05-2026 08:01 PM

అశ్వాపురం,(విజయక్రాంతి): అశ్వాపురం మండలంలోని మొండికుంట మేజర్ గ్రామ పంచాయతీలో కోతుల బెడద తీవ్రంగా పెరిగి ప్రజలకు గాయాలు కలిగించడం, పంటలను ధ్వంసం చేయడం వంటి సమస్యలు ఎక్కువవడంతో సర్పంచ్ మర్రి సంధ్య స్పందించారు. గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని స్వంత ఖర్చుతో సుమారు రూ.50 వేల వరకు వ్యయం చేసి, గ్రామ పంచాయతీ పెద్దల సహకారంతో కోతులను పట్టించే చర్యలు చేపట్టారు.

ఇందుకోసం ప్రత్యేకంగా కోతులను పట్టే బృందాన్ని పిలిపించి, వాటికి ఎలాంటి గాయాలు కాకుండా బోనుల్లో బంధించి, ఆహారం మరియు నీటి సదుపాయం ఉన్న అనుకూల ప్రాంతాలకు తరలించారు. ఈ చర్యలతో గ్రామంలో కోతుల బెడద తగ్గి ప్రజలకు, పంటలకు రక్షణ లభించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కోతుల సమస్యను సమర్థంగా పరిష్కరించిన సర్పంచ్ మర్రి సంధ్యను గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు అభినందించారు.