రాజేశ్ లాకప్ డెత్ కేసులో కీలక ఆదేశాలు
- పూర్తిస్థాయి నివేదికను మూడు వారాల్లో సమర్పించాలి
- సూర్యాపేట కలెక్టర్, ఎస్పీలకు ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు
సూర్యాపేట, జూన్ 30 (విజయక్రాంతి): రాష్ట్రంలో సంచలనం రేపిన రాజేశ్ లాకప్ డెత్ కేసులో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి పూర్తిస్థాయి నివేదికను మూడు వారాల్లో సమర్పించాలని సూర్యాపేట జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులను ఆదేశించింది. రాజేశ్‌ను కోదాడ పోలీసులు ఐదు రోజుల పాటు అక్రమంగా నిర్బంధించి థర్డ్ డిగ్రీ పద్ధతుల్లో చిత్రహింసలకు గురిచేశారని న్యాయవాది రామారావు ఇమ్మినేని ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదును ప్రాథమికంగా పరిశీలించిన కమిషన్ ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని వివరణ కోరింది. బాధిత కుటుంబ సభ్యులు ఈ ఘటనను కస్టడీ హత్యగా పరిగణించాలని, బాధ్యులపై హత్య కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను సమర్పించాలని ఎన్హెచ్‌ఆర్సీ ఆదేశించింది. ప్రత్యేకంగా పోస్ట్మార్టం వీడియో, పోస్ట్మార్టం నివేదిక, మేజిస్ట్రియల్ విచారణ వివరాలు, వైద్యపత్రాలు, కేసు దర్యాప్తునకు సంబంధించిన అన్ని రికార్డులను కమిషన్ ముందు ఉంచాలని సూచించింది. అలాగే ఈ వ్యవహారంలో ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని పేర్కొంది.
ఈ కేసులో సూర్యాపేట జిల్లా కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించిందా? ఎలాంటి చర్యలు తీసుకుందనే వివరాలను కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్ కోరింది. రాష్ట్ర కమిషన్ పాత్ర, దర్యాప్తు స్థితిగతులపై నివేదిక ఇవ్వాలని సూచించింది. కాగా రాజేశ్‌ను సీఎంఆర్‌ఎఫ్ నిధుల దుర్వినియోగం కేసు దర్యాప్తు నేపథ్యంలోనే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం.






