27 July, 2026 | 8:31 PM

దళితుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

27-07-2026 07:34 PM

- వామపక్షాల డిమాండ్

ఆదిలాబాద్,(విజయక్రాంతి): భీంసరీ దళితుడిని హత్యచేసిన బీజేపీ మాజీ సర్పంచ్ మయూర్ చంద్రాను కఠినంగా శిక్షించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్ నారాయణ డిమాండ్ చేశారు. సోమ వారం ప్రజాసంఘాల నాయకులు అన్నమొల్ల కిరణ్, ఆర్ మంజుల, ఆర్ సురేందర్ రెడ్డీ, కే ఆశన్నలతో కలసి వారు గ్రామానికి వెళ్లీ బాధిత కుటుంబాన్ని పరామర్శించి చంద్ర భార్యను, కుమారుడిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం...  బాధితుడు మాజీ సర్పంచు ఇంటికీ వెల్లిన సమయంలో ఆగ్రహించి ఇనుప రాడ్డుతో విపరీతంగా దాడి చేశాడని, అపస్మారక స్థితిలోకి వెళ్ళిన బాధితుడిని రిమ్స్ లో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని నాయకులతో వారు వాపోయారు. పేదవాడు దళితుడు కావడంతోనే అగ్రకులస్తుడైన మయూర్ చంద్ర తన తండ్రినీ కొట్టి చంపాడని బాధితుని కుమారుడు  కన్నీరు పెట్టుకొన్నారని తెలిపారు. 

బాధిత కుటుంబానికి  ప్రభుత్వ ఉద్యోగం, మూడు ఎకరాల సాగుభూమి ఇవ్వాలి

బాధిత కుటుంబం నిరుపేద దళిత కుటుంబమయినందున రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు మూడు ఎకరాల వ్యవసాయ భూమి మంజూరు చేయాలనీ వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. నిందితుడు రాజకీయ పలుకుబడి కలిగిన వాడు కావడంతో కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందన్నారు. చట్టం ముందు అందరూ సమానమే అనే నమ్మకాన్ని పేదలకు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఆ కుటుంబాన్ని ఎంఎల్ఎగానీ, అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించకపోవడం వివక్షలో భాగమేనని వారు ఆరోపించారు. బాధితులకు న్యాయం కోరుతూ త్వరలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టనున్నట్టు వారు పేర్కొన్నారు.