తరుగు పేరుతో రూ.71 లక్షల అవినీతి
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ ధర్నా
చుంచుపల్లి,(విజయక్రాంతి): రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు సమయంలో క్వింటాకు 8 కిలోల చొప్పున తరుగు పేరుతో ధాన్యం కోత విధించి సుమారు రూ.71 లక్షల మేర అవినీతి జరిగిందని ఆరోపిస్తూ తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ (టీఆర్‌ఎల్డీ ) ఆధ్వర్యంలో సోమవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రీయ లోకల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కట్టా సతీష్ అధ్యక్షత వహించగా, రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్ నాయకత్వం వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యానికి అన్యాయంగా 8 కిలోల తరుగు విధించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, రైతులకు జరిగిన నష్టాన్ని వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. సహకార సంఘాల్లో జరుగుతున్న అవకతవకలను అరికట్టడంతో పాటు రైతుల హక్కులను పరిరక్షించాలన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






