27 July, 2026 | 8:48 PM

Breaking News

ఉరుమడ్ల మహిళల సత్తా.. రాష్ట్ర స్థాయి త్రోబాల్ పోటీలకు అర్హత.

27-07-2026 07:57 PM

జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం – విజేతలకు సర్పంచ్ భానుశ్రీ భిక్షం అభినందనలు.

చిట్యాల,(విజయక్రాంతి): ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామోత్సవం సందర్భంగా కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి మెమోరియల్ కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి మహిళల త్రోబాల్ పోటీల్లో చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామ మహిళల జట్టు అద్భుత ప్రతిభ కనబరిచింది. పోటీల్లో ద్వితీయ స్థానం సాధించి రెండో బహుమతిని కైవసం చేసుకున్న ఈ జట్టు, త్వరలో హైదరాబాద్‌లో జరగనున్న రాష్ట్ర స్థాయి త్రోబాల్ పోటీలకు అర్హత సాధించింది. ఈ సందర్భంగా విజేతలను ఉరుమడ్ల గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీ భిక్షం ప్రత్యేకంగా అభినందించారు. గ్రామ క్రీడాకారులు తమ ప్రతిభతో ఉరుమడ్ల గ్రామానికి జిల్లా స్థాయిలో గుర్తింపు తీసుకురావడం గర్వకారణమని ఆమె అన్నారు.

క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని, క్రీడల్లో రాణించడం ద్వారా భవిష్యత్తులో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలను కూడా అందిపుచ్చుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు తన సొంత ఖర్చులతో జెర్సీలను అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉయ్యాల నరేష్, ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు, వార్డు సభ్యులు గంగాపురం రాము, వెలిమినేటి హరిప్రసాద్, మెడబోయిన స్వాతి శ్రీను, బోయ సుష్మిత, మహిళా క్రీడాకారులు మాధగోని నాగమణి, కోరబోయిన పుష్పలత, మర్రి కల్పన, సాగర్ల వైష్ణవి, ఈర్ల నవ్యతో పాటు గ్రామస్థులు పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.