నేడు సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభం
- సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం
- కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా సేవలు
- 1,082 పడకలు.. 300 ఐసీయూ బెడ్స్
- 31 మేజర్ ఆపరేషన్ థియేటర్లు
- 12 నిమిషాల్లో పరీక్షల నమూనాల తరలింపు
హైదరాబాద్/జూబ్లీహిల్స్, ఆగస్టు 16 (విజయక్రాంతి): సామాన్య ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సనత్‌నగర్‌లో నిర్మించిన ప్రతిష్ఠాత్మక డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎంసీఆర్ టిమ్స్)ను సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు. ప్రభుత్వ వైద్యరంగంలో అత్యాధునిక సౌకర్యాలతో కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా టిమ్స్ సనత్‌నగర్ రూపుదిద్దుకుంది.
ప్రభుత్వ రంగంలో ఒకే దశలో నిర్మించిన అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా ఇది ప్రత్యేకతను సంతరించుకుంది. 22.6 ఎకరాల విస్తీర్ణంలో, 11.70 లక్షల చదరపు అడుగుల నిర్మిత విస్తీర్ణంతో అభివృద్ధి చేశారు. నాలుగు బ్లాకులుగా నిర్మించిన టిమ్స్ 75 శాతం నీటి పొదుపుతో ఐజీబీసీ గోల్డ్ రేటింగ్ సాధించింది. ఆరు కీలక విభాగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా దీన్ని తీర్చిదిద్దారు. ఈ ఆసుపత్రిలో రోగులకు సమగ్ర వైద్య సేవలు అందనున్నాయి.
ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ రంగంలో నిర్మితమైన టిమ్స్‌లో ఏర్పాటు చేయటం విశేషం. ఈ వ్యవస్థ ద్వారా రోగుల నుంచి పరీక్షలు చేసేందుకు సేకరించిన నమూనాలు ఒకటి నుంచి రెండు నిమిషాల్లోనే సంబంధిత పరీక్షా కేంద్రాలకు చేరతాయి.
30 శాతం ఐసీయూ బెడ్లు
ఆస్పత్రిలో మొత్తం 1,082 పడకలు, అందులో 300 ఐసీయూ పడకలు ఉన్నాయి. మొత్తం పడకల్లో దాదాపు 30 శాతం ఐసీయూలకు కేటాయించడం ద్వారా అత్యవసర, క్లిష్ట వైద్య సేవలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఆస్పత్రిలో సివిల్ నిర్మాణాలు, మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ (ఎంఈపీ) వ్యవస్థలతోపాటు ఆధునిక వైద్య పరికరాలు, సాంకేతిక సదుపాయాలను మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) సమకూర్చింది.
హైదరాబాద్ నడిబొడ్డున క్లాసిక్ ఆర్కిటెక్చర్‌తో కాంక్రీట్ నిర్మాణంగా రూపుదిద్దుకున్న టిమ్స్ సనత్‌నగర్ ప్రభుత్వ వైద్యరంగంలో భారీ స్థాయి మౌలిక వసతులు, అత్యాధునిక సాంకేతికత, పర్యావరణ పరిరక్షణ, భద్రతను సమన్వయం చేసిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా నిలిచింది. ప్రభుత్వ ఆస్పత్రులు కూడా ప్రైవేటు కార్పొరేట్ వైద్య సంస్థలకు దీటైన స్థాయిలో ఆధునిక, సూపర్ స్పెషాలిటీ సేవలు అందించగలవని ఈ ప్రాజెక్టు చాటిచెబుతోందని వైద్య రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
నాలుగు బ్లాకులు.. సమగ్ర వైద్య సేవలు
ఆస్పత్రిని నాలుగు ప్రధాన బ్లాకులుగా ప్రభుత్వం నిర్మించింది. మొత్తం 31 మేజర్, 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లు ఇందులో ఉన్నాయి. డయాగ్నస్టిక్స్ విభాగంలో 17 పాథాలజీ ల్యాబ్‌లు, 12 మైక్రోబయాలజీ ల్యాబ్‌లు, 10 బయోకెమిస్ట్రీ ల్యాబ్‌లు, 5 ప్రత్యేక ల్యాబ్‌లు ఉన్నాయి. బ్లాక్ అత్యవసర సేవలు, 15 ఆపరేషన్ థియేటర్లు, 30 ఐసీయూ బెడ్లు, సెంట్రల్ స్టెరైల్ సర్వీస్ విభాగం ఉన్నాయి. బ్లాక్ ఓపీ రిజిస్ట్రేషన్, సెంట్రల్ ఫార్మసీ, కార్డియాక్ ఆపరేషన్ థియేటర్, లీనాక్ ఆధారిత న్యూక్లియర్ మెడిసిన్ విభాగం, రెండు క్యాథ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. బ్లాక్- రేడియాలజీ, పాథాలజీ ల్యాబ్‌లు, సాధారణ, ప్రైవేట్ వార్డులు, వీఐపీ సూట్లు ఉన్నాయి. బ్లాక్ పరిపాలన, విద్యా విభాగాలతోపాటు 200 మంది కూర్చునే ఆడిటోరియం ఉంది.






