17 August, 2026 | 4:02 AM

పోస్టులు ఉన్నట్టా? లేనట్టా?

17-08-2026 02:20 AM
  1. ప్రీప్రైమరీ పోస్టుల భర్తీకి బ్రేక్
  2. నియామకాలపై స్పష్టత కరువు
  3. నియామకం కొరకు ఎదురుచూస్తున్న అభ్యర్థులు
  4. నియామక ప్రక్రియపై స్పష్టత ఇవ్వాలని అభ్యర్థుల డిమాండ్

వెంకటాపూర్, ఆగస్టు 16 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విద్యను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన నియామక ప్రక్రియ ములుగు జిల్లాలో మాత్రం ముందుకు సాగడం లేదు. ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు స్వీకరించి చాలా కాలం గడిచినా ఇప్పటి వరకు అభ్యర్థుల ఎంపిక జరగలేదు. దీంతో పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తీవ్ర అయోమయంలో పడుతున్నారు. అసలు పోస్టులు ఉన్నాయా.? ఉంటే నియామకాలు ఎప్పుడు చేపడతారు.? అనే ప్రశ్నలు అభ్యర్థుల నుంచి వినిపిస్తున్నాయి.

పోస్టుల నియామకం కోసం ఎదురుచూపులు

చిన్నారులకు ప్రైమరీ స్థాయి నుంచే నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు చేపట్టగా, ఇందుకోసం ఒక్కో పాఠశాలలో అవసరమైన సిబ్బందిని నియమించేందుకు ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి జూన్ 23వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. పోస్టులు భర్తీ అవుతాయని ఆశించిన అభ్యర్థులు తమ విద్యార్హతలు, ఇతర ధ్రువపత్రాలతో దరఖాస్తులు చేసుకున్నారు. అయితే దరఖాస్తుల స్వీకరణ అనంతరం నెలలు గడుస్తున్నా ఎంపిక ప్రక్రియ మాత్రం ముందుకు సాగకపోవడంతో అభ్యర్థుల ఆశలు నిరాశగా మారుతున్నాయి. దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎంపిక జాబితా కోసం ఎదురుచూస్తున్నప్పటికీ అధికారులు ఇప్పటి వరకు స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవడంతో వారిలో ఆందోళన నెలకొంది.

మండల పరిధిలో ఆరు పోస్టులు

మండల పరిధిలోని వెంకటాపూర్, పాలంపేట, లక్ష్మీదేవిపేట, బూర్గుపేట, నర్సింగపూర్, ఒడ్డెరగూడెం ప్రైమరీ పాఠశాలల్లో ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా పోస్టుల భర్తీ కోసం అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సుమారు 100 అభ్యర్థుల నుంచి దరఖాస్తులు రాగా, నియామకాలు పూర్తయితే తమకు ఉపాధి లభించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులకు బోధించే అవకాశం లభిస్తుందని వారు ఆశించారు. కానీ ఇప్పటి వరకు ఎంపిక ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో దరఖాస్తుదారులు ప్రతిరోజూ నియామక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరుగుతూ సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ స్పష్టమైన సమాధానం లభించడం లేదని అభ్యర్థులు వాపోతున్నారు.

నియామకాలు ఉన్నట్టా.? లేనట్టా.?

ఈ పోస్టులకు దరఖాస్తులు స్వీకరించి నెలలు గడుస్తున్నా నియామక ప్రక్రియను నిలిపివేయడంతో అభ్యర్థుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు పోస్టులు భర్తీ చేస్తారా.? లేక నియామక ప్రక్రియను రద్దు చేస్తారా.? లేక పోస్టులు ఉన్నట్టా.? లేనట్టా.? అనే విషయంపై అధికారుల నుంచి స్పష్టత రావాలని వారు కోరుతున్నారు. నియామకాలు చేపట్టే ఉద్దేశం ఉంటే ఎంపిక ప్రక్రియకు సంబంధించిన తేదీలను ప్రకటించాలని, లేదంటే పోస్టుల పరిస్థితిపై అధికారికంగా సమాచారం ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు భర్తీ కొరకు నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉన్నతాధికారుల ఆదేశాలు రాగానే నియామక ప్రక్రియ

ప్రీ-ప్రైమరీ పోస్టుల భర్తీకి సంబంధించి మండల పరిధిలో అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించాం. వచ్చిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి, అర్హత కలిగిన అభ్యర్థుల వివరాలను సిద్ధం చేసి వారి వివరాలను గత నెలలోనే జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా విద్యాశాఖ అధికారికి సమర్పించాం. అయితే ఇప్పటి వరకు ఉన్నతాధికారుల నుంచి పోస్టుల నియామకం సంబంధించి ఎలాంటి ఆదేశాలు, మార్గదర్శకాలు జారీ కాలేదు. ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన వెంటనే నిబంధనల ప్రకారం తదుపరి నియామక ప్రక్రియను చేపడతాం. అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అధికారికంగా ఆదేశాలు వచ్చిన తర్వాత పూర్తి వివరాలను తెలియజేస్తాం.

- ప్రభాకర్, మండల విద్యాధికారి