‘సాకేత్ ఇంజినీర్స్’ ఘరానా మోసం
- యజమానులకు తెలియకుండా విల్లాల మార్టిగేజ్
- ప్రణామం అపార్ట్‌మెంట్‌లో ప్లాట్లు కూడా తాకట్టు
- వాటిపై రూ. 80 కోట్ల రుణం
- లబోదిబోమంటున్న యజమానులు
- పోలీసులకు ఫిర్యాదు
- మేడ్చల్ జిల్లా గౌడవెల్లి పరిధిలో వెలుగులోకి
- రిజిస్ట్రేషన్ శాఖ అధికారులపైన అనుమానాలు
మేడ్చల్, మే 19 (విజయక్రాంతి): సాకేత్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఘరానా మోసానికి పాల్పడింది. యజమానులకు తెలియకుండా వారి విల్లాలు, ప్లాట్ల్లను అక్రమంగా తాకట్టు పెట్టి రూ.80 కోట్ల రుణం పొందినట్లు తేలింది. తమకు తెలియకుండా విల్లాలు, ప్లాట్లను మార్ట్‌గేజ్ చేసిన కంపెనీ డైరెక్టర్లు టి.రాధాకృష్ణ, జి.రవికుమార్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
వివరాలు.. హైదరాబాద్‌కు చెందిన సాకేత్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రెసిడెన్షియల్ విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణంలో ప్రసిద్ధి. నగరం చుట్టుపక్కల అనేక గేటెడ్ కమ్యూనిటీలు నిర్మించి నమ్మకమైన సంస్థగా పేరు పొందింది. ఇందులో భాగంగా మేడ్చల్ జిల్లా గౌడవెల్లి శివారులో 2009లో భారీ ప్రాజెక్టును చేపట్టింది.
ఇందులో దశల వారీగా విల్లాలు నిర్మించింది. భూసత్వ ఫేజ్‌హా పాటు సీనియర్ సిటిజన్స్ కోసం ప్రణామం పేరిట అపార్ట్‌మెంట్‌లు నిర్మించింది. మొదటిసారి 2009లో 18.26 ఎకరాల్లో భూసత్వ ఫేజ్ నిర్మాణానికి భూ యజమానులతో డీజీపీఏ ఒప్పందం చేసుకుంది. ఆ తర్వాత దీనికి అనుబంధంగా మరో నాలుగు ఎకరాల్లో విల్లాలు నిర్మించింది. 2013- నుంచి విక్రయాలు ప్రారంభించింది.
ఎలా రుణం పొందారంటే?
2009లో భూ యజమానులతో డీజీపీఏ చేసుకున్న దాని ఆధారంగా 2018లో మొదటిసారి విస్ట్రా ఐటీసీ (ఇండియా) ద్వారా రుణం పొందారు. రూ.38 కోట్లు మంజూరు కాగా రూ. 6 కోట్లు తీసుకున్నారు. మిగతా రుణం 2018- తీసుకున్నారు. అప్పట్లో విల్లాలు, ఓపెన్ ప్లాట్లు సాకేత్ కంపెనీవే. ఆ తర్వాత విల్లాలు విక్రయించారు. కొనుగోలుదారులు కూడా వీటిపై రుణం తీసుకోగా.. అప్పట్లో ఈసీ కూడా వచ్చింది. ఆ తర్వాత వీటిపై సాకేత్ ఇంజనీర్స్ కంపెనీ రుణం తీసుకుంది.
ఈసీ(ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్) విషయంలో మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది సహకరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విస్ట్రా ఐటీసీ (ఇండియా) డిబెంచర్ ట్రస్ట్రీగా వ్యవహరిస్తోంది. సాకేత్ కంపెనీ డివెంచర్స్ ఇష్యూ చేసింది. డివెంచర్ ట్రస్ట్‌గా ఉన్న విస్టా ఐటీసీ మార్ట్‌గేజ్ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, సబ్ రిజిస్ట్రేషన్ శాఖ సైతం చూసీ చూడనట్లు వ్యవహరించినట్లు తెలుస్తోంది.
మోసం వెలుగులోకి వచ్చిందిలా..
ఒక విల్లా యజమాని బ్యాంకులో రుణం తీసుకోవాలని భావించి, ఇటీవల ఈసీ కోసం దరఖాస్తు చేయగా తనఖా పెట్టినట్లు తేలింది. దీంతో కంగుతిన్న ఆ యజమాని మిగతా వారికి కూడా చెప్పగా వారు తనిఖీ చేసుకున్నారు. వారిలో చాలామంది విల్లాలు తనఖాలో ఉన్నట్లు తేలింది. ఒక విల్లా యజమాని 2020లో కొనుగోలు చేసి బ్యాంకు రుణం తీసుకొని ఆ తర్వాత మొత్తం చెల్లించాడు. 2025 జనవరిలో ఈసీ కోసం దరఖాస్తు చేయగా క్లియర్‌గా ఉంది. మళ్లీ 2025 అక్టోబర్‌లో దరఖాస్తు చేయగా విస్టా కంపెనీకి తనఖా పెట్టినట్లు తేలింది.
మోసం బహిర్గతం కావడంతో రుణం మొత్తం ఒకే రోజు చెల్లింపు
మోసం బహిర్గతమై, బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేసరికి సాకేత్ కంపెనీ దిగి వచ్చింది. మే 1వ తేదీన ఈ విషయం అసిస్టెంట్ కమిషనర్ దృష్టికి వెళ్లింది. 2వ తేదీన పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయగా, 5వ తేదీన ఎఫ్‌ఐఆర్ అయింది. దీనికంటే ఒకరోజు ముందు సాకేత్ యాజమాన్యం రుణం మొత్తం ఒకేసారి చెల్లించింది. రూ. 80 కోట్లు రుణం తీసుకోగా వడ్డీతో రూ.89 కోట్లు చెల్లించింది.
ఆందోళనలో విల్లాలు, ప్లాట్ల యజమానులు
సాకేత్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన వెంచర్‌లో విల్లాలు, ఓపెన్ ప్లాట్లు, ప్రణామం అపార్ట్‌మెంట్‌లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే చాలామంది ఈసీ కోసం దరఖాస్తు చేస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో ఉండాలనే ఉద్దేశంతో ఇందులో ఎక్కువగా రిటైర్డ్ ఉద్యోగులు, ఎన్‌ఆర్‌ఐలు, ఐటీ ఉద్యోగులు కొనుగోలు చేశారు. ప్రణామం అపార్ట్‌మెంట్‌లలో చాలామంది తమ వృద్ధ తల్లిదండ్రుల కోసం ప్లాట్లు కొనుగోలు చేశారు. సొంత ప్లాట్లే అయినా భోజనం నిర్వాహకులే పెడతారు. దీంతో విదేశాల్లో ఉన్నవారు, వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నవారు వారి తల్లిదండ్రుల కోసం ప్రణామం అపార్ట్‌మెంట్‌లో ప్లాట్లు కొనుగోలు చేశారు. కంపెనీ తమను నమ్మకద్రోహం చేస్తుందని అనుకోలేదని యజమానులు వాపోతున్నారు.
కేసు నమోదు
సాకేత్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మోసంపై బాధితులు సుమారు 120 మంది పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు 316 (2), 318 (4), ఆర్/w 3 (5) బిఎన్‌ఎస్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
నమ్మక ద్రోహం చేసింది
సాకేత్ ఇంజినీర్స్ కంపెనీ మాకు నమ్మకద్రోహం చేసింది. ప్రభుత్వ ప్రైవేటు వ్యవస్థలు కూడా వారికి సహకరించాయి. దీనిపై సమగ్ర విచారణ జరగాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఇటువంటి మోసాలు పునరావృతం కాకుండా చూడాలి. మోసాలపై అప్రమత్తంగా ఉండేలా ప్రజలకు అవగాహన కల్పించాలి.
అనిత విట్టల్, బాధితుడు
కఠినంగా శిక్షించాలి
మా విల్లాలను మాకు తెలియకుండా తాకట్టు పెట్టారు. ఇది క్రిమినల్ ఆలోచన. దీనిపై చర్యలు తీసుకొని చట్ట ప్రకారం బాధ్యులను కఠినంగా శిక్షించాలి. ఈ విషయమై ఈఓడబ్ల్యూ కు ఫిర్యాదు చేశాం.
-రోహిత్‌రెడ్డి, బాధితుడు






