11 May, 2026 | 9:41 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు – సేంద్రియ సాగుతోనే భవిష్యత్‌

11-05-2026 08:29 PM

చివ్వెంల,(విజయక్రాంతి): చివ్వెంల మండలంలోని తిరుమలగిరి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు అరుణకుమారి, సునీత పాల్గొని రైతులకు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయంలో అధిక రసాయన ఎరువుల వినియోగం వల్ల నేల సారవంతత తగ్గిపోవడంతో పాటు రైతుల సాగు ఖర్చులు పెరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా యూరియా అధిక మోతాదులో వాడటం వల్ల నేల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు పంటల నాణ్యత తగ్గే ప్రమాదం ఉందన్నారు. అవసరమైన మేరకే యూరియా మరియు ఇతర రసాయన ఎరువులను వినియోగించాలని సూచించారు.

సేంద్రియ ఎరువులు, జీవామృతం, ఘనజీవామృతం, వర్మీ కంపోస్టు వంటి ప్రకృతి ఆధారిత పద్ధతులను పాటించడం ద్వారా ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు సాధ్యమవుతాయని తెలిపారు. సేంద్రియ వ్యవసాయం రైతులకు దీర్ఘకాలిక లాభాలను అందించడంతో పాటు వినియోగదారులకు ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తుందని వివరించారు.

పంట మార్పిడి విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని శాస్త్రవేత్తలు సూచించారు. ఒకే పంటను వరుసగా సాగు చేయడం వల్ల నేలలో పోషకాలు తగ్గిపోవడంతో పాటు పురుగులు, వ్యాధులు అధికమవుతాయని తెలిపారు. పంట మార్పిడి ద్వారా నేల సారాన్ని పెంచుకోవడంతో పాటు రైతులు సుస్థిర ఆదాయం పొందవచ్చని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రైతులు శాస్త్రవేత్తలను నేరుగా ప్రశ్నలు అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. వ్యవసాయంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయ సలహాలు పాటిస్తే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.