16 August, 2026 | 6:47 PM

కల్తీ పెరుగు, కోవా తయారీ కేంద్రంపై ఎస్‌ఓటీ దాడి

16-08-2026 05:23 PM

ఉప్పల్ ఆగష్టు 16, విజయక్రాంతి: కాప్రా సర్కిల్ పరిధిలోని వైష్ణవి ఎన్‌క్లేవ్‌లో నిర్వహిస్తున్న నందిని మిల్క్ సెంటర్‌పై మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించి భారీ మొత్తంలో కల్తీ పెరుగు, కోవాను స్వాధీనం చేసుకున్నారు. ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తూ ఎలాంటి తయారీ, గడువు తేదీలు, నాణ్యతకు సంబంధించిన లేబుళ్లు లేకుండా ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారంతో ఈ దాడులు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.పోలీసుల తనిఖీల్లో సుమారు 120 కిలోల కత్తి పెరుగు, 6 కిలోల కోవాను తరలిస్తున్న రామచంద్రరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మిల్క్ సెంటర్‌లో నిర్వహించిన సోదాల్లో మరో 50 కిలోల పెరుగు, 50 కిలోల కోవా నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న ఉత్పత్తులను పరీక్షల నిమిత్తం సంబంధిత అధికారులకు అప్పగించినట్లు సమాచారం.

ప్రాథమిక విచారణలో తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందేందుకు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా పెరుగు, కోవా తయారీ జరుగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి హానికరంగా మారే అవకాశమున్న ఆహార పదార్థాలను మార్కెట్‌లోకి పంపుతున్నారనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఎస్‌ఓటీ ఎస్‌ఐ సాయికుమార్ మాట్లాడుతూ, ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ లేదా నాణ్యత లేని ఆహార పదార్థాల తయారీ, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ప్రజలు కూడా అనుమానాస్పద ఆహార ఉత్పత్తులపై వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా, ఆహార పదార్థాల నాణ్యతపై మరింత కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.